విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం.
గంజ్ హైస్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ మీల్స్ పథకాన్ని ప్రారంభించిన మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్.
కరీంనగర్, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించడం ఎంతో ముఖ్యమని కరీంనగర్ మాజీ మేయర్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు.
కరీంనగర్ నగరంలోని గంజ్ హైస్కూల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్‌ఫాస్ట్ మీల్స్ పథకాన్ని ఆయన విద్యార్థులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన ఆయన, వారికి అందించే అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్ధార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఎదగడానికి, విద్యలో మెరుగైన ఫలితాలు సాధించడానికి పౌష్టికాహారం దోహదపడుతుందని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యతో పాటు వారి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ, చక్కగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడేఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని సర్ధార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు. 


Comments