సర్వీస్ రోడ్డుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ప్లాన్ మార్చండి మహాప్రభో!
స్టేషన్ ఘన్‌పూర్‌లో నిర్మాణ పనులపై విమర్శలు..
ప్రమాదాలపై స్థానికుల ఆందోళన
సర్వీస్ రోడ్డును వదిలి పక్కకు నిర్మించాలని డిమాండ్
స్టేషన్ ఘన్‌పూర్,అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–163)పై స్టేషన్ ఘన్‌పూర్ పట్టణంలో చేపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్థానికుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ప్రజల రహదారి దాటే సౌకర్యం, భద్రత కోసం చేపట్టిన నిర్మాణం వల్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సర్వీస్ రోడ్డుపై బ్రిడ్జి పిల్లర్లు నిర్మిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఆరోపిస్తున్నారు.
జాతీయ రహదారిపై హనుమకొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో చేపడుతున్న ఈ పనులతో సర్వీస్ రోడ్డు వినియోగానికి ఆటంకం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో స్టేషన్ ఘన్‌పూర్‌తో పాటు జాఫర్‌గఢ్, పాలకుర్తి, దేవరుప్పుల మండలాల నుంచి వచ్చే వాహనదారులు ప్రధాన రహదారిపైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల రహదారిపై వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సర్వీస్ రోడ్డుకు ఆటంకం లేకుండా నిర్మాణ పనులకు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించాలని వారు కోరుతున్నారు. ఈ సమస్యపై జనగామ జిల్లా కలెక్టర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సర్వీస్ రోడ్డుపై పనులు నిలిపివేయాలి: మాచర్ల గణేష్
సర్వీస్ రోడ్డుపై జరుగుతున్న నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, రోడ్డుకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేలా హైవే అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేష్ డిమాండ్ చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే విధంగా పనులు కొనసాగించకూడదని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించొద్దు: ఎండీ రహమతుల్లా
సర్వీస్ రోడ్డుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎండీ రహమతుల్లా పేర్కొన్నారు.
ప్రజా రవాణాకు ఆటంకం కలగకుండా నిర్మాణ పనులను పక్కకు మార్చాలని కోరారు. జిల్లా అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలు స్పందించి హైవే అధికారులతో మాట్లాడి సర్వీస్ రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Comments