పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష.
సత్తుపల్లి కోర్టు తీర్పు.. రూ.20 వేల జరిమానా విధింపు.
సత్తుపల్లి, అక్టోబరు 28 (తెలంగాణ ముచ్చట్లు):
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై కత్తితో దాడి చేసి గాయపరిచిన కేసులో నిందితుడికి సత్తుపల్లి ఆరో అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.20 వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం. శ్రీనివాస్ తీర్పు వెలువరించారు.
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేంద్ర అలియాస్ సూర్య (36) ఈ కేసులో నిందితుడు. 2025 మార్చి 10న చోరీ కేసులో నిందితుడి కోసం సత్తుపల్లి పట్టణ పరిసరాల్లో గాలిస్తున్న పోలీసులపై సురేంద్ర కత్తితో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనపై సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 126/2025గా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 109, 132, 121(1) సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో సెక్షన్ 109 కింద పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా, సెక్షన్ 132 కింద రెండేళ్ల సాధారణ కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా, సెక్షన్ 121(1) కింద ఏడాది సాధారణ కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కేసు దర్యాప్తులో మొదటి అధికారిగా ఖమ్మం సీసీఆర్‌బీ సబ్ ఇన్‌స్పెక్టర్ టి. కవిత, రెండో దర్యాప్తు అధికారిగా సత్తుపల్లి సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వీరప్రసాద్ వ్యవహరించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డానియల్ ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించారు. కేసు విచారణలో సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీహరి, పోలీస్ అధికారులు, సిబ్బంది సహకరించారు. కోర్టు లైజన్ అధికారులుగా ఎస్‌ఐ కె. శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ డి. నాగేశ్వరరావు, సీడీఓగా పి.సి. వి. నరేష్, ప్రాసెస్ విధుల్లో హోంగార్డు జె. పర్వీన్ అందించిన సహకారాన్ని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.


Comments