ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి!
-జర్నలిస్టులకు పెన్షన్, ఇంటి స్థలాలు కేటాయించాలి..
-ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య
ఎల్కతుర్తి అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించి ఇళ్లు మంజూరు చేయాలని ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యవర్గ సభ్యుడు చుంచు ఐలయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎల్కతుర్తిలో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్‌డబ్ల్యూజే) 76వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చుంచు ఐలయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జర్నలిస్టులకు అర్హతల ఆధారంగా ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ప్రాధాన్యం కల్పించి సొంతింటి కలను సాకారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు ఇతర రాష్ట్రాల తరహాలో పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులకు భద్రత, ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, పెన్షన్, ఇళ్ల స్థలాలు, గృహ వసతి వంటి అంశాలపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని చుంచు ఐలయ్య కోరారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ చైర్మన్ సాతూరి చంద్రమౌళి, ప్రెస్ క్లబ్ సభ్యులు డాక్టర్ ఉదయ్ చందర్, రామోజు సతీష్ చారి, జూపాక శ్రీనివాస్, ఎర్రోళ్ల రాజబాబు, రాజిరెడ్డి, అడ్డూరి అనిల్, బొంకూరి కార్తీక్, బొంకూరి వంశీ, ఎర్రోళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.


Comments