జమ్మికుంట బీసీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించాలి.
* ఒకే గదిలో 30 మంది విద్యార్థుల అవస్థలు.. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి
* ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్
జమ్మికుంట, అక్టోబర్ 28 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బీసీ సంక్షేమ హాస్టల్‌కు నూతన సొంత భవనం నిర్మించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు లేకపోవడంతో విద్యార్థులు అరకొర వసతుల మధ్య ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జమ్మికుంట బీసీ సంక్షేమ హాస్టల్‌లో ఒకే గదిలో సుమారు 30 మంది విద్యార్థులు నిద్రించాల్సిన పరిస్థితి ఉందని, కనీసం తలుపులు, కిటికీలు కూడా సరిగా లేవని పేర్కొన్నారు. విద్యార్థులకు సరిపడా గదులు, మరుగుదొడ్లు, ఇతర కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు.
గత మూడేళ్లుగా జమ్మికుంటలోని సంక్షేమ హాస్టల్‌ను మూడు వేర్వేరు ప్రైవేట్ భవనాల్లోకి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నప్పటికీ హాస్టల్‌కు సొంత భవనం నిర్మించడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం తగదన్నారు.
పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా విద్యార్థులకు అందించే మెస్, కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. చలికాలం సమీపిస్తున్నప్పటికీ విద్యార్థులకు ఇప్పటివరకు దుప్పట్లు పంపిణీ చేయకపోవడం విచారకరమన్నారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
మార్పు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని శ్రీకాంత్ విమర్శించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే జమ్మికుంట బీసీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి తన సొంత జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి నూతన హాస్టల్ భవనం నిర్మించడంతోపాటు మెరుగైన వసతులు కల్పించకపోతే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటనలను అడ్డుకుని నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు రత్నం సురేష్, నాయకులు ఆదిత్య, నిఖిల్, మనోజ్,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. 


Comments