జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఇల్లందకుంటలో వ్యాసరచన పోటీలు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం.
ఇల్లందకుంట, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు.
హుజూరాబాద్‌కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్, మండల విద్యాధికారి కె. రాములు నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నజ్మీన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి కె. రాములు నాయక్, ప్రధానోపాధ్యాయురాలు తస్లీమ్ నజ్మీన్ మాట్లాడుతూ విద్య మనిషికి నిజమైన బలమని, జ్ఞానార్జనతో దేశ పురోగతికి, సమాజ అభివృద్ధికి కృషి చేయవచ్చని అన్నారు. తలవంచి పుస్తకం చదివితే అదే పుస్తకం మనల్ని తలెత్తుకుని జీవించేలా చేస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవడంతో పాటు పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ మాట్లాడుతూ 2011 సంవత్సరం నుంచి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, సమాజంలోని పేదలకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ నాయకుల జయంతి, వర్ధంతి సందర్భంగా వ్యాసరచన, క్రీడలు, ప్రతిభా పోటీలు నిర్వహిస్తూ వారి ఆశయాలను విద్యార్థులకు పరిచయం చేస్తున్నట్లు వివరించారు.
మండల స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇల్లందకుంటకు చెందిన ఎం. రచన, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఇల్లందకుంటకు చెందిన పి. నాగలక్ష్మికి శంకర్ నారాయణ డిక్షనరీలతో పాటు మెమెంటోలు అందజేశారు. కన్సొలేషన్ బహుమతులుగా బి. రక్షిత, ఎం. అక్షయ్, ఎం. సహస్ర, కె. రితిక్, డి. కావ్యశ్రీ, బి. నితిన్, ఎం. అక్షయ్, డి. రితికలకు డిక్షనరీలు అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె. జయప్రకాష్, సీహెచ్. వేణు, కె. సత్యం, జె. రాధికారాణి, మండల ఉపాధ్యాయులు ఎస్. అనసూయ, ప్రేమ్ రాజు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments