మద్దతు ధరకు తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేయాలి...
జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్.
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 11(తెలంగాణ ముచ్చట్లు )
మద్దతు ధరకు తగ్గకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్ వ్యాపారులు, రైస్ మిల్లర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్ ఆదేశాల మేరకు సత్తుపల్లి, తల్లాడ, కల్లూరు మండలాలకు చెందిన ధాన్యం వ్యాపారులు, రైస్ మిల్లర్లతో సత్తుపల్లి మిల్ పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల అధికారి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి మాట్లాడుతూ, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ఏమాత్రం తగ్గకుండా చెల్లించాలని స్పష్టం చేశారు. సన్నరకం ధాన్యానికి క్వింటాలకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 2,481 తో పాటు, ప్రభుత్వం అందించే బోనస్ రూ. 500 కలిపి మొత్తం రూ. 2,981 చెల్లించాలన్నారు. దొడ్డురకం ధాన్యానికి క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,461 చెల్లించాలనీ తెలిపారు. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయరాదని, వీలైతే రైతులకు అండగా నిలుస్తూ మద్దతు ధర కంటే ఎక్కువ ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని వ్యాపారులు, మిల్లర్లకు సూచించారు.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి రైతులను నష్టపరిచే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్చరించారు. రైతులు కూడా తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధర లేదా అంతకంటే ఎక్కువ చెల్లించే వ్యాపారులకే విక్రయించాలని విజ్ఞప్తి చేశారు.


Comments