సీనియర్ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
*వృద్ధులను గౌరవించడం మన సంస్కృతి.. వారి అనుభవాలు సమాజానికి మార్గదర్శకం*
*రాజయోగ ధ్యానంతో మానసిక ప్రశాంతత*
*జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ను ఆనందంగా గడపాలి*
*‘సంగం’ సదస్సులో బ్రహ్మకుమారి కల్పన*
హుజురాబాద్, నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు ):
వృద్ధాప్యం అనేది జీవితానికి ముగింపు కాదని, జీవితంలో ఎన్నో అనుభవాలను సంపాదించి, ఆ అనుభవాల సారాన్ని సమాజానికి అందించే అద్భుతమైన దశ అని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధి బ్రహ్మకుమారి కల్పన పేర్కొన్నారు. వయసు పెరిగినంత మాత్రాన మనిషిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం తగ్గాల్సిన అవసరం లేదని, సీనియర్ సిటిజన్లు తమ అనుభవం, విజ్ఞానం, నైపుణ్యాలతో సమాజానికి దిక్సూచిగా నిలవాలని పిలుపునిచ్చారు. వృద్ధులను నడిచే దేవతలుగా భావించి గౌరవించడం మన భారతీయ సంస్కృతిలో భాగమని గుర్తుచేశారు.
వయోవృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించి, వారిలో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు జీవితంలోని మలి దశను ఆనందంగా గడిపేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్రహ్మకుమారీస్ సామాజిక సేవా విభాగం, భారత ప్రభుత్వ సామాజిక న్యాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంగం’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రజాపిత బ్రహ్మకుమారీస్ హుజురాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మకుమారి కల్పన ముఖ్య వక్తగా హాజరై సీనియర్ సిటిజన్లకు పలు విలువైన సూచనలు చేశారు.


Comments