దళితుల భూములు తిరిగి అప్పగించకుంటే.. కేసీఆర్, కేటీఆర్ భూములను స్వాధీనం చేసుకుంటాం
డాక్టర్ పిడమర్తి రవి హెచ్చరిక
నవంబర్ 29న హైదరాబాద్‌లో కార్తీకమాస వనభోజనాలు
హైదరాబాద్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్రంలో దళితులు తరతరాలుగా సాగు చేసుకుంటూ అనుభవిస్తున్న ఇనాం, అసైన్డ్ భూములను గత ప్రభుత్వ పెద్దలు అక్రమంగా కబ్జా చేశారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గుంతకల్లు జగదీశ్వర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు దళితుల భూములను ఆక్రమించుకున్నారని విమర్శించారు.
ఈ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి నెల రోజుల్లోగా తిరిగి దళితులకు అప్పగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని అన్నారు. తక్షణమే భూములను సర్వే చేసి బాధిత దళితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలోని అన్ని దళిత సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి, సంబంధిత భూముల వద్దకు వెళ్లి దళితుల భూములను దళితులే స్వాధీనం చేసుకుని పంచుకుంటామని హెచ్చరించారు.
నవంబర్ 29న కార్తీకమాస వనభోజనాలు
కార్తీకమాస వనభోజనాలను నవంబర్ 29న హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించనున్నట్లు డాక్టర్ పిడమర్తి రవి వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. విశిష్ట అతిథులుగా రాష్ట్ర శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొంటారని తెలిపారు. మాదిగ ఉపకులాలకు చెందిన కవులు, కళాకారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డ యాదయ్య, జాతీయ దళిత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు భూదాల బాబురావు, దళిత బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, మాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు నక్క మహేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జెర్రీపోతుల సాయన్న, దేవరకొండ నరేష్, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జోగు గణేష్, నక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Comments