ఇంటర్‌కు స్వస్తి.. పాఠశాలల్లోనే 12వ తరగతి!

ఇంటర్‌కు స్వస్తి.. పాఠశాలల్లోనే 12వ తరగతి!

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సంస్కరణలు

వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం

పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గించడమే లక్ష్యం

-సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):

రాష్ట్రంలో విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా సమూల విద్యా సంస్కరణలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

విద్యాశాఖపై మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత విద్య, వృత్తి విద్యా కోర్సులు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.కొత్త విద్యా విధానంలో నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు ప్రాథమిక విద్య, ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు మాధ్యమిక విద్య, తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు సీనియర్ మాధ్యమిక విద్య కొనసాగించాలని ముఖ్యమంత్రి సూచించారు. పన్నెండో తరగతి పూర్తయ్యే నాటికి విద్యార్థులకు భాషా నైపుణ్యాలు, సమాచార పరిజ్ఞానంపై పూర్తి పట్టు ఉండేలా బోధన అందించాలని అన్నారు. ఆ తర్వాత విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో నిపుణులుగా ఎదిగేలా అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు.

చదువు మధ్యలోనే ఆగిపోకూడదు

పదో తరగతి పూర్తయిన తర్వాత చాలామంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేస్తున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. వారిలో ఎక్కువ మంది బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులే ఉంటున్నారని తెలిపారు. పన్నెండో తరగతి వరకు విద్య కొనసాగించే అవకాశం ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువు మానేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని వివరించారు.దేశంలోని 18 రాష్ట్రాల్లో ఇప్పటికే పన్నెండో తరగతి వరకు ఒకే విద్యా విధానం అమలవుతోందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోనూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. ఈ మార్పుల వల్ల జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అద్దె భవనాల్లో సంక్షేమ వసతి గృహాలు ఉండకూడదు

రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట సొంత భవనాలను నిర్మించి, విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు.యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పురోగతిపై సమీక్షించిన ముఖ్యమంత్రి, నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నగర పరిధిలో నిర్మిస్తున్న పాఠశాలల పనుల పురోగతిని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

వృత్తి విద్యకు ప్రోత్సాహం.. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు

పారిశ్రామిక శిక్షణ సంస్థలను అధునాతన శిక్షణ కేంద్రాలుగా మార్చిన తర్వాత విద్యార్థుల ప్రవేశాలు పెరగడంతో పాటు, శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణకు అవసరమైన నిధుల విడుదలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సహాయ, సహచర, ఇతర ఆచార్యుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నియామకాల్లో నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ మొలుగరం కుమార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.IMG-20261111-WA0037IMG-20261111-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News

మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి. మురసు తుఫాన్‌ నష్టంపై సీఎంకు ఎమ్మెల్యే జారె వినతి.
- దెబ్బతిన్న రహదారులు, మౌలిక వసతుల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి. అశ్వారావుపేట, నవంబరు 11(తెలంగాణ ముచ్చట్లు):  మురసు తుఫాన్‌ కారణంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో...
భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం. 
ప్రజలకు మేలు జరిగేలా భూముల రీసర్వే చేపట్టాలి.
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక.. భగినీ హస్త భోజనం!
అన్నదమ్ములకు ఆప్యాయంగా భోజనం వడ్డించిన అక్కాచెల్లెళ్లు..
సీనియర్‌ సిటిజన్లు సమాజానికి దిక్సూచి..
క్రికెట్ మైదానంలో సీఐ విశ్వేశ్వర్ సిక్సర్ల మోత!