మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకం…
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. శ్రీజ
–ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు
ఖమ్మం బ్యూరో , నవంబర్ - 11(తెలంగాణ ముచ్చట్లు )
స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తో కలిసి అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడూతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆజాద్ విద్యా రంగానికి చేసిన సేవలు, ఆయన ఆలోచనలు, పోరాట పటిమ ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆజాద్, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యా వ్యవస్థకు బలమైన పునాదులు వేశారన్నారు. ఐఐటీ, ఐఐఎస్సీ, యూజీసీ, సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటులో అబుల్ కలాం ఆజాద్ పాత్ర మరవరానిదని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు, సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆజాద్ అన్నారని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. రామ్మూర్తి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహ్మద్ ముజాహిద్, జిల్లా పశు సంవర్ధక అధికారి డా. పురందర్, జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని అబుల్ కలాం ఆజాద్‌కి నివాళులర్పించారు.


Comments