భారతీయ కళల వారసత్వాన్ని కొనసాగిద్దాం.
---పిల్లల సృజనాత్మకతను వెలికి తీసేలా ప్రోత్సహించాలి.
--సెల్ ఫోన్ బానిసత్వానికి దూరంగా ఉండాలి.
--జిల్లా అడిషనల్ సిపి రామానుజం.
--హోరెత్తిన రాష్ట్రస్థాయి బాలోత్సవ్ సంబురాలు.
--పలు జిల్లాల నుంచి హాజరైన బాల కళాకారులు.
ఖమ్మం బ్యూరో, నవంబర్ 11(తెలంగాణ ముచ్చట్లు )
మనదేశ కళల వారసత్వాన్ని ప్రతి తరం వారు కొనసాగించాలని రాష్ట్రస్థాయి బాలోత్సవ్ సంబురాల ప్రారంభ సభలో జిల్లా అడిషనల్ పోలీస్ కమిషనర్ రామానుజం తెలియజేశారు. స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం వారధి ఫౌండేషన్, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్ వేడుకల ప్రారంభోత్సవానికి అడిషనల్ సిపి రామానుజం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన దేశానికి చెందిన కళారూపాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. మన సాంప్రదాయ జానపద కళారూపాలకు రోజురోజుకూ సినిమాల్లోనూ అత్యధిక ప్రాధాన్యత పెరుగుతోందని తెలిపారు.
పిల్లల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేలా తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించాలని కోరారు. పిల్లలు సెల్ఫోన్ బానిసత్వానికి గురికాకుండా సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలని సృజనాత్మకతను పెంపొందించే కళలను నేర్చుకోవడం ద్వారా మానసికంగా, శారీరకంగా , దృఢంగా రూపొందుతారని, సైబర్ నేరాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాయల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఖమ్మం బాలోత్సవ్ సంబురాల సభలో వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ బాలోత్సవంలో పాల్గొనడమే పిల్లలకు గొప్ప విజయం అని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సంబురాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కూరపాటి ప్రదీప్, డాక్టర్ జంగాల సునీల్ కుమార్, గ్రంథాలయ చైర్మన్ ఖాదర్ బాబా, డాక్టర్ కాటమనేని రాజకుమార్, నృత్యదర్శకులు ఆర్ ఎన్ ప్రసాద్, న్యాయ నిర్ణేతలు లింగం శ్రీనివాసరావు, జైపాల్, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ బాధ్యులు
చిక్కుళ్ల వెంకటేష్, పగిల్లపల్లి రాజు,
ఆర్ ఎన్ ప్రసాద్ ,రాజేష్ ,భవాని శంకర్, ముకేశ్, నాని,సతీష్ తదితరులు పాల్గొన్నారు.
--
వారధి ఫౌండేషన్ ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్ లో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు హోరెత్తాయి. బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, పలు జిల్లాల నుంచి బాలలు 300 మందికి పైగా పోటీలలో పాల్గొన్నారు. తొలి రోజు సాంప్రదాయ విభాగాలలో జూనియర్, సీనియర్ విభాగాలలో బాల బాలికలు తమ సృజనాత్మకతకు దర్పణం పట్టారు. నెమళ్ళు నాట్యం ఆడినట్లుగా సాంప్రదాయ వస్త్రధారణలో సంగీతానికి అనుగుణంగా స్టెప్పు లేస్తూ బాలల ప్రదర్శించిన నృత్యాలు సబికులను
ఉర్రూతలుగించాయి. అతిపెద్ద డిజిటల్ స్క్రీన్ పై , డిజిటల్ లైట్ల వెలుగులతో బాల బాలికలు ప్రదర్శించిన నృత్యాలను తల్లిదండ్రులు తిలకించి మురిసిపోయారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలన్ని సబికులని కనువిందు చేశాయి.
సోలో క్లాసికల్ , ఫోక్ డాన్స్ విభాగాలకు 200 ఎంట్రీస్, గ్రూప్ క్లాసికల్, ఫోక్ డాన్స్ కు గాను 40ఎంట్రీస్, ఫ్యాన్సీ డ్రెస్ విభాగానికి 50ఎంట్రీల ద్వారా బాల బాలికలు తమ సృజనతో కనువిందు చేస్తున్నారు. ఖమ్మం బాలోత్సవ్ పోటీలు గురువారం సాయంత్రం వరకు జరుగుతాయని, అనంతరం విజేతలకు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమంలో అతిధులు బహుమతి ప్రధానం చేస్తారని వారధి ఫౌండేషన్ చైర్మన్ చింతనిప్పు కృష్ణ చైతన్య, ఖమ్మం డాన్సర్స్ అసోసియేషన్ నిర్వాకులు తెలియజేశారు. ఖమ్మంలో తొలిసారిగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఖమ్మం బాలోత్సవ్ కు బాల బాలికల నుంచి అనూహ్య స్పందన రావడంతో నిర్వాహకుల్లో ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయి.


Comments