చదువుతో పాటు పౌష్టికాహారం.. గోపాలపూర్‌లో ఉచిత అల్పాహార కార్యక్రమం ప్రారంభం!
ఎల్కతుర్తి, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించి, ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు.
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చదువుపై ఆసక్తి, ఏకాగ్రత పెరిగేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.
ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గోపాలపూర్ గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కర్రే లక్ష్మి, ఉప సర్పంచ్ మారుపాక సందీప్, జెడ్పీహెచ్‌ఎస్ ప్రధానోపాధ్యాయులు కిషన్ రావు, ఎంపీపీఎస్ బస్టాండ్ ప్రధానోపాధ్యాయులు సదానందం, గ్రామ పంచాయతీ కార్యదర్శి మిల్కూరి గణపతి, వార్డు సభ్యులు శ్రీపతి లావణ్య, జూపాక సంధ్యారాణి, వల్లెపు స్వప్న, పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తూ వారి ఆరోగ్యానికి, ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని గ్రామ ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.


Comments