భారత్‌లో సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న మధుమేహం.
*ప్రజలు జీవనశైలి మార్పులతో మధుమేహాన్ని నియంత్రించుకోవాలి : మేయర్ కొలగాని శ్రీనివాస్.*
కరీంనగర్, నవంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా భారతీయులకు మధుమేహ వ్యాధి నిశ్శబ్ద హంతకిగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు దీనిపట్ల అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. మధుమేహం బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు ఆహార నియమాలు, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం పాటించాలని సూచించారు. భారత్‌లో దాదాపు 100 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతుండటం ఆందోళనకరమని, దీనిని ప్రతి ఒక్కరూ హెచ్చరికగా తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆదివారం కరీంనగర్ పట్టణంలో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320జీ ఆధ్వర్యంలో నిర్వహించిన మధుమేహ వ్యాధి అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మధుమేహంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
లయన్స్ జిల్లా గవర్నర్ మోరె భద్రేశం మాట్లాడుతూ జిల్లా 320జీ పరిధిలోని వందకు పైగా లయన్స్ క్లబ్బులు నవంబర్ మాసంలో మధుమేహ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమ సమన్వయకర్త లయన్ గుండోజు లక్ష్మయ్య నాయకత్వంలో తెలంగాణ కూడలి వద్ద ప్రారంభమైన ర్యాలీ బస్‌స్టాండ్ మీదుగా టవర్ సర్కిల్ వరకు కొనసాగింది.
ర్యాలీలో పాల్గొన్న లయన్స్ సభ్యులు మధుమేహ నివారణపై నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నగర ప్రజల్లో అవగాహన కల్పించారు. టవర్ సర్కిల్ వద్ద గుమిగూడిన ప్రజలకు మధుమేహ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పీడీజీ హెచ్. రాజిరెడ్డి, సీనియర్ లయన్స్ కెప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి, కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని వివిధ లయన్స్ క్లబ్బుల సభ్యులు, పీఎస్టీలు, జెడ్సీలు, ఆర్సీలు, పీఆర్సీలు, పీజెడ్సీలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో లయన్స్ సభ్యులు సహకరించారు.


Comments