పంచాయతీ కార్యదర్శి చొరవతో ఇద్దరు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు.
నిరుపేద కుటుంబానికి పెన్షన్ మంజూరులో కార్యదర్శి సురేష్ ప్రత్యేక చొరవ.
ధర్మసాగర్, నవంబర్ 11 (తెలంగాణ ముచ్చట్లు):
నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు మానసిక వైకల్యం ఉన్న వ్యక్తులకు ప్రభుత్వ పింఛన్లు మంజూరు కావడంలో పంచాయతీ కార్యదర్శి చూపిన చొరవ అభినందనీయంగా నిలిచింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరాలనే సంకల్పంతో ఆయన చేసిన కృషి ఆ కుటుంబంలో కొత్త ఆశలు నింపింది.హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఆకారపు సురేష్ గతంలో కషగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలో సయ్యద్ అమీర్ కుమారులైన ఏలీషా బీ, యాకుబ్ బాబా మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని గుర్తించారు. అయితే వారికి అవసరమైన సదరం ధ్రువీకరణ పత్రం పొందే విధానం గురించి కుటుంబ సభ్యులకు అవగాహన లేకపోవడంతో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయారు.
విషయాన్ని గుర్తించిన సురేష్ స్వయంగా బాధితులను, వారి కుటుంబ సభ్యులను మీ సేవ కేంద్రానికి తీసుకెళ్లి దరఖాస్తు చేయించారు. అప్పటి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ సహకారంతో సదరం ధ్రువీకరణ పత్రాలు ఇప్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అనంతరం ఆ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రభుత్వం ప్రకటించిన పింఛను పథకానికి దరఖాస్తు చేయించారు.
ఈ క్రమంలో ఇటీవల ఇద్దరికీ పింఛన్లు మంజూరు కాగా, మంగళవారం ధర్మసాగర్ మండల కేంద్రంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య చేతుల మీదుగా పింఛను మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా బాధితుల తండ్రి అమీర్ మాట్లాడుతూ తమ కుటుంబానికి అండగా నిలిచి, తమ కుమారులకు పింఛన్లు మంజూరయ్యేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కడియం కావ్యతో పాటు జిల్లా కలెక్టర్, సీఈవో, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్డీవో శ్రీనివాస్, ఎంపీడీవో, ఎంపీవో, తహసీల్దార్, అప్పటి కార్యదర్శి ఆకారపు సురేష్, ప్రస్తుత కార్యదర్శి రమేష్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత సర్పంచ్ ఇమామ్ బీ, ప్రస్తుత సర్పంచ్ సత్తార్‌ల సహకారాన్ని గుర్తుచేసుకున్నారు.ప్రభుత్వ పథకాలు అర్హులైన నిరుపేదలకు చేరేలా అధికారులు చొరవ చూపితే ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ఈ ఘటన మరోసారి నిరూపించింది.


Comments