శీనన్న పై అభిమానం ఉప్పొంగింది..
బైక్ ర్యాలీ హోరెత్తింది!
* గొల్లగూడెం నుంచి ఖమ్మం వరకు..పొంగులేటి శీనన్నకు జన నీరాజనం
* వేలాది బైకులతో కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ
* జై కాంగ్రెస్.. జై ఇందిరమ్మ ఇళ్ల శీనన్న నినాదాలతో మార్మోగిన రహదారులు
ఖమ్మం బ్యూరో, నవంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు )
అన్నపై అభిమానం ఉప్పొంగింది.. బైకుల జోరు హోరెత్తింది.. కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి.. జై కాంగ్రెస్.. జై ఇందిరమ్మ ఇళ్ల శీనన్న నినాదాలతో రహదారులు మార్మోగాయి. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి... పాలేరు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతోషం, హర్షం వ్యక్తం చేస్తూ.. ఆదివారం రాత్రి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో పండగ వాతావరణం నెలకొంది. గొల్లగూడెం నుంచి ఖమ్మం నగరంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు వేలాది బైకులతో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నాయి.
తిరుమలాయపాలెం మండలం మీదుగా వస్తున్న మంత్రి పొంగులేటికి గొల్లగూడెం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి వేలాది బైకుల ర్యాలీ.. నినాదాల హోరుతో ముందుకు సాగింది. దారిపొడవునా పార్టీ శ్రేణుల ఉత్సాహం, అభిమానుల కోలాహలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యకర్తల అభిమానం చూసి మంత్రి సైతం కారు రూఫ్టాప్పైకి చేరుకుని చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వారి ఉత్సాహాన్ని మరింత పెంచుతూ ముందుకు సాగారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా 968 మందికి ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్లు మంజూరు చేసింది. అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేసేందుకు మంత్రి పొంగులేటి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్లుగా చేసుకుని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఓవైపు పింఛన్ల మంజూరుతో లబ్ధిదారుల ఇళ్లలో ఆనందం.. మరోవైపు వేలాది బైకుల ర్యాలీతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం.. వెరసి మంత్రి పర్యటన ఏదులాపురంలో సందడి నింపింది.
*ఈ కార్యక్రమంలో..:* మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్కెట్ చైర్మన్ బైరు హరినాధ బాబు, మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కిషోర్ నాయక్, డివిజన్ల అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments