అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లుగా కాంగ్రెస్ పాలన.

అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లుగా కాంగ్రెస్ పాలన.

* అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు.. ప్రజా ప్రభుత్వ లక్ష్యం
* గత పాలకులు పింఛన్లు, రేషన్ కార్డులను, పేదోడి గూటిని పట్టించుకోలేదు
* కాళేశ్వరం పేరుతో.. కమీషన్ల పాలన చేసింది 
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* తిరుమలాయపాలెం మండలంలో కొత్తగా 1,123 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

ఖమ్మం బ్యూరో, నవంబర్ 15(తెలంగాణ ముచ్చట్లు )

అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి కొత్తగా మంజూరైన 1,123 చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను కలెక్టర్ దివాకర్ టీఎస్, కాంగ్రెస్ నేతలతో కలిసి మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారని, పింఛన్లు, రేషన్ కార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపై క్వింటాకు రూ.500 బోనస్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. అర్హులైన పేదలకు చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ అండగా నిలుస్తున్నామని తెలిపారు.
*ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు*
మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, హైదరాబాద్‌లో పేదలకు మరో లక్ష ఇళ్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. ఈ నెలాఖరులోగా తుది బిల్లు మంజూరు చేస్తామని తెలిపారు. మొత్తం రూ.40 వేల కోట్లతో ఎనిమిది లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నామని, మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.
*పాలేరు నియోజకవర్గంలో అదనంగా 5,279 పింఛన్లు*
తిరుమలాయపాలెం మండలంలో ఇప్పటికే 9,024 మందికి నెలకు రూ.2.99 కోట్ల పింఛన్లు అందుతున్నాయని, తాజాగా మరో 1,123 మందికి రూ.38.76 లక్షల విలువైన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 37,039 మందికి రూ.8.69 కోట్ల పింఛన్లు అందుతుండగా, తాజాగా మరో 5,279 మందికి రూ.1.43 కోట్ల పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీలో 968, కూసుమంచి మండలంలో 1,126, ఖమ్మం రూరల్ మండలంలో 882, నేలకొండపల్లి మండలంలో 1,175, తిరుమలాయపాలెం మండలంలో 1,123 మందికి కొత్తగా పింఛన్లు మంజూరైనట్లు వివరించారు.
*మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట*
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో రూ.26 కోట్లతో 100 పడకల ఆసుపత్రి, రూ.46 కోట్లతో ఐటీఐ కళాశాల నిర్మాణ పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గ్రామాల్లో సీసీ రహదారులు నిర్మించడంతోపాటు డొంకలు, మట్టి రహదారులను తారు రోడ్లుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య, విద్యా సదుపాయాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్, ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్ చావా శివరామకృష్ణ, IMG-20261115-WA0033మాజీ జెడ్పిటిసి బెల్లం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్, పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News