గురువుల స్థానంలో శిష్యులు.. ఆల్టిట్యూడ్ పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు!
ఎల్కతుర్తి నవంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
సెయింట్ థామస్ ఆల్టిట్యూడ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల స్థానాల్లో నిలబడి తరగతి గదుల్లో పాఠాలు బోధించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు పాఠాలు చెప్పడంతో పాటు పాటలు పాడుతూ, వివిధ అంశాలపై ప్రసంగిస్తూ తమలోని ప్రతిభను ప్రదర్శించారు. ఉపాధ్యాయుల బాధ్యతలు, విద్యార్థులకు విద్యాబోధన చేయడంలో వారు పడే కష్టాలు, ఎదుర్కొనే సవాళ్ల గురించి చక్కగా వివరించారు. ఉపాధ్యాయుల స్థానంలో నిలబడిన తర్వాత వారి బాధ్యత ఎంత గొప్పదో స్వయంగా అనుభవించి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పుష్కరి కార్తీక్ రావు మాట్లాడుతూ.. పిల్లలంటే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు ఎంతో ఇష్టమని, వారి భవిష్యత్తు దేశ భవిష్యత్తుతో ముడిపడి ఉందని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానం పెంపొందుతాయని అన్నారు. నేటి విద్యార్థులే రేపటి ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
చదువుతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల పాత్రను పోషించిన విద్యార్థులు కొత్త అనుభూతిని పొందగా, బాలల దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మర్రి అశోక్, వైస్ ప్రిన్సిపాల్ లింగ మొగిలి, వ్యాయామ ఉపాధ్యాయుడు కర్రే తిరుపతి, సరిత, లావణ్య, సురేష్, ఆశా బేగం, లలిత, సుమలత, రమేష్, కవిత, కావ్య, స్వప్న, కృష్ణ, కళ్యాణి, రమ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Comments