నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు.
- పలుస శంకర్ గౌడ్ జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు.
వనపర్తి,నవంబర్14(తెలంగాణ ముచ్చట్లు):
నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలని, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల బాధ్యతని సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు.వనపర్తి పట్టణంలోని వల్లభ నగర్లో గల రేడియంట్ స్కూల్ బ్రాంచ్ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలుస శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదువుకోవడంతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిపై ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. దేశానికి సేవ చేసే గొప్ప పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు పెద్దలను గౌరవించడం ప్రతి విద్యార్థి బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు. పిల్లలలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు పాఠశాలలు, తల్లిదండ్రులు సమానంగా కృషి చేయాలని తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దేశీ రాములు, ముజుభా, మద్దిలేటి, మైత్రి, శైలజ, నరేష్, రమేష్, రాజేంద్ర ప్రసాద్ చారి, స్వప్న, హేమలత, పుష్పలత, కళ్యాణి, జహంగీర్‌తో పాటు పాఠశాల యాజమాన్య సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. దీంతో పాఠశాల ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది. చివరగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అతిథులకు, కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.


Comments