ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పోరాట ఫలితం.
– బుక్కపురం మహేష్ మాదిగ, ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి
వనపర్తి,నవంబర్16(తెలంగాణ ముచ్చట్లు):
ఎస్సీ వర్గీకరణ ద్వారా లభిస్తున్న రిజర్వేషన్ అవకాశాలను సద్వినియోగం చేసుకొని మాదిగ విద్యార్థులు విద్యా, ఉద్యోగ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జి బుక్కపురం మహేష్ మాదిగ పిలుపునిచ్చారు.వనపర్తి జిల్లా కేంద్రంలోని అభయాస్ జూనియర్ కళాశాల సెమినార్ హాల్‌లో మాదిగ విద్యార్థి సమాఖ్య (ఎంఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల సదస్సుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కో-ఇన్‌చార్జి మొలకలపల్లి పరుశరాముడు మాదిగ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బుక్కపురం మహేష్ మాదిగ, జిల్లా కో-ఇన్‌చార్జి మీసాల గణేష్ మాదిగ హాజరయ్యారు.ఈ సందర్భంగా బుక్కపురం మహేష్ మాదిగ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా కుల వివక్షత రూపాలు మారుతున్నప్పటికీ సమాజంలో కుల వివక్షత పూర్తిగా అంతం కాలేదన్నారు. కుల వ్యవస్థ నుంచి ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ మాదిగ విద్యార్థులు ఆత్మవిశ్వాసం, సంకల్పబలంతో ముందుకు సాగాలని సూచించారు.మాదిగ జాతి విద్యా, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో మందకృష్ణ మాదిగ మూడు దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేశారని, ఆ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ చట్టం సాధ్యమైందని పేర్కొన్నారు. వర్గీకరణ ద్వారా అందుబాటులోకి వచ్చిన 9 శాతం రిజర్వేషన్ అవకాశాలను వినియోగించుకొని మాదిగ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు.విద్యార్థులు వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభ్యున్నతికి కూడా కృషి చేయాలని, మహనీయుల ఆశయాల సాధన కోసం ప్రతి మాదిగ విద్యార్థి ఎంఎస్‌ఎఫ్‌లో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. మహనీయుల బాట, మందకృష్ణ మాదిగ మాట విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని, విద్యార్థులు ఐక్యత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని అన్నారు.సదస్సు సందర్భంగా అభయాస్ జూనియర్ కళాశాల ఎంఎస్‌ఎఫ్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కళాశాల అధ్యక్షుడిగా రేపల్లి ధనుష్ మాదిగ ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిని నాయకులు అభినందించి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ఎంఎస్‌ఎఫ్ సంస్థ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా మాజీ అధ్యక్షుడు, ఎంఎస్‌ఎఫ్ వనపర్తి జిల్లా కో-ఇన్‌చార్జి కొమ్ము చెన్నకేశవులు మాదిగ, పుట్టపగ అజయ్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ సీనియర్ నాయకుడు గంధం గట్టయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments