పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా
– వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెద్దమందడి,నవంబర్17(తెలంగాణ ముచ్చట్లు):
ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటూ వారి రుణం తీర్చుకుంటానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు, రేషన్ కార్డులు, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో రోజులుగా పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, వడ్డీలేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లతో ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందన్నారు. ఇందిరా బీమా ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.వనపర్తి నియోజకవర్గంలో ప్రతినెలా సుమారు రూ.11 కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, 5,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన పెద్దమందడి రహదారి పనులను త్వరలోనే తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీల అధ్యక్షురాలు నవనీత క్యామ రాజు, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, సర్పంచ్ గంగా రవీందర్, మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, జిల్లా యువజన అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, రామకృష్ణారెడ్డి, సత్యారెడ్డి, రమేష్ గౌడ్, మనిగిల్ల తిరుపతిరెడ్డి, ఎంపీడీవో, తహసీల్దార్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Comments