సింగిల్ విండో పీఠాలపై 'రెడ్డి'ల గురి!
బడుగు బలహీన వర్గాలకు అవకాశం దక్కేనా?
వనపర్తి,నవంబర్18(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి నియోజకవర్గానికి ప్రభుత్వం నాలుగు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) మంజూరు చేయడంతో ఇప్పుడు వాటి చైర్మన్ పదవులపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ పదవులు ఎవరికి దక్కనున్నాయి? ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించనుంది? అనే అంశాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో రేవల్లి, ఏదుల, సోలిపూర్, వెల్టూరు గ్రామాలకు నాలుగు సింగిల్ విండోలు మంజూరు కావడంతో ఆశావహుల్లో పదవులపై ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ చైర్మన్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నట్లు చర్చ సాగుతోంది. నాలుగు పదవులు కూడా అదే సామాజిక వర్గం ఖాతాలోకి వెళ్లనున్నాయా? లేక ఇతర వర్గాలకు కూడా అవకాశం కల్పిస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ఈసారి సింగిల్ విండో చైర్మన్ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పిస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడిన అన్ని వర్గాల నాయకులకు సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా వెల్టూర్ గ్రామంలో కొత్త సింగిల్ విండో ఏర్పాటు కావడంతో అక్కడి చైర్మన్ పదవి ఎవరిని వరించనుందన్న ఆసక్తి కూడా స్థానికంగా నెలకొంది. పదవుల పంపకంలో సామాజిక సమతుల్యత పాటిస్తారా? లేక ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మొత్తానికి నాలుగు సింగిల్ విండోల ఏర్పాటు రైతులకు శుభవార్త కాగా, వాటి చైర్మన్ పదవుల కేటాయింపు మాత్రం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చివరకు బడుగు బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యత దక్కుతుందా? లేక ఆశావహులకు నిరాశే మిగులుతుందా? అనేది వేచి చూడాలి.


Comments