ఆదర్శ పాఠశాలలో విద్యార్థులతో మమేకమైన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.*
మానకొండూర్, నవంబర్ 18 (తెలంగాణ ముచ్చట్లు):
మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాలలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అల్పాహార కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ముందుగా వంటగదిని పరిశీలించి, తయారవుతున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. ఆహార తయారీలో పరిశుభ్రత, పోషక విలువలు పాటిస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా అల్పాహారం వడ్డించి, వారితో కలిసి కూర్చొని భోజనం చేశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వారి చదువు, ఆరోగ్యం, క్రమశిక్షణకు సంబంధించిన విషయాలపై ప్రోత్సాహించారు.
జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సైతం ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు, వారి పోషకాహార అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Comments