ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ
జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన ధైర్యసాహసాలు, అసమాన పోరాట పటిమ, దేశభక్తి యావత్ భారతదేశానికి స్ఫూర్తిదాయకమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ బాలికల కన్వీనర్ నిత్యశ్రీ అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన ఆమె వీరత్వం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.
వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జమ్మికుంట శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్త్రీ శక్తి దివస్' కార్యక్రమంలో నిత్యశ్రీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం నేటి యువతకు, ముఖ్యంగా విద్యార్థినులకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ సమాజంలో తమదైన గుర్తింపు సాధించాలని పిలుపునిచ్చారు.
మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో చైతన్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థినులకు ఈ సందర్భంగా బహుమతులు, పురస్కారాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి భోగం శశాంక్, సంయుక్త కార్యదర్శులు ఆదిత్య, ఆఫ్రిద్, ఉపాధ్యక్షులు మోయిజ్, ఆరిఫ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments