మీ హయాంలో జరగని పనులను మీ ఖాతాలో వేసుకోవడమేంటి రాజన్న?

మీ హయాంలో జరగని పనులను మీ ఖాతాలో వేసుకోవడమేంటి రాజన్న?

అభివృద్ధి పనులపై తప్పుడు ప్రచారం మానుకోవాలి

కడియం శ్రీహరిపై వ్యక్తిగత విమర్శలు సరికాదు

కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్‌ ఘాటు వ్యాఖ్యలు

స్టేషన్ ఘనపూర్,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలిపాక సతీష్ విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రాజయ్య ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టకముందే జరిగిన పనులను వారి హయాంలో జరిగినవిగా ఎలా చెప్పుకుంటారని ఆయన ప్రశ్నించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్, ఫ్లైఓవర్ బ్రిడ్జి, పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణ పనులకు పునాదులు పడ్డాయని సతీష్ గుర్తుచేశారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం స్టేషన్ ఘనపూర్‌ను ఇందిరమ్మ గ్రామంగా ఎంపిక చేసిన సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ఈ అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. అప్పటికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, రాజయ్య ఎమ్మెల్యేగా లేరని పేర్కొన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గాంధీ చౌరస్తా నుంచి రైల్వే గేట్ వరకు రహదారి నిర్మాణ పనులు పూర్తి చేయడానికి ఏళ్ల తరబడి సమయం పట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించి, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును రెండుసార్లు అడ్డుకున్న అనంతరమే సంబంధిత అధికారుల ద్వారా రహదారి పనులు పూర్తి చేయించామని వివరించారు.అదేవిధంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి వరంగల్ జిల్లా ఆర్‌అండ్‌బీ అప్పటి ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ నాగేందర్, డీఈ జీవన్‌కుమార్‌లకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారిపై బ్రిడ్జి నిర్మాణం విషయంలో స్థానికుల అభిప్రాయాలను పట్టించుకోకుండా పిల్లర్ల బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగిందని ఆరోపించారు.

జఫర్‌గఢ్, పాలకుర్తి రహదారుల నిర్మాణం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశామని, ఆ తర్వాతే పనులు ముందుకు సాగాయని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో వాస్తవాలను ప్రజలకు వివరించాల్సింది పోయి, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం తగదన్నారు.తొలి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వంద పడకల ఆసుపత్రి, మున్సిపాలిటీ మంజూరుకు సంబంధించిన జీవోలు తీసుకొచ్చినప్పటికీ వాటి పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులోనూ కడియం శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో వంద పడకల ఆసుపత్రి, మున్సిపాలిటీ, ఇంటిగ్రేటెడ్ విద్యా, వైద్య సదుపాయాలతో పాటు రైతులకు సాగునీరు అందించడం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, ముఖ్యమంత్రి సహాయనిధి, రాజీవ్ ఆరోగ్యశ్రీ, రహదారుల నిర్మాణం వంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.నియోజకవర్గ అభివృద్ధికి జరుగుతున్న కృషిని అభినందించాల్సింది పోయి, నిరాధార ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని సతీష్ మండిపడ్డారు. ఇకనైనా చరిత్రను వక్రీకరించే వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మామిడ్ల శ్రీనివాస్, గట్టు కోటేశ్వర్, సురేందర్, అజీముద్దీన్, నక్క పాపయ్య, ఏలీయా, రమేష్, శివ, కుమార్, శ్రీనివాస్, సందీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం. ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం.
* మహిళల్లో ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: నిత్యశ్రీ జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు): భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి ప్రదర్శించిన...
విద్యార్థులకు చేయూత.
ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం.
ఉద్యమకారుల హక్కుల కోసం మేడారం నుంచి మరో పోరుబాట.
మహిళా సాధికారతకు సిరిసేడులో కొత్త వేదిక.
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులకు యువతే దిక్సూచి.
మాదిగ ఉపకులాల వనభోజనాలకు ప్రముఖులకు ఆహ్వానం.