ఇందిరమ్మ బీమాతో ప్రతి కుటుంబానికి భరోసా.
సిద్ధిపేట సభకు జమ్మికుంట కాంగ్రెస్ శ్రేణుల భారీ తరలింపు
జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
సిద్ధిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న ఇంటింటికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమానికి జమ్మికుంట మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వీరమనేని పరశురామ్ రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో వావిలాల సర్పంచ్ కొండ అర్జున్, నాగారం సర్పంచ్ మమత ప్రదీప్, మడిపెల్లి సర్పంచ్ తిరుమల వెంకటేష్, ఉపసర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వావిలాల సర్పంచ్ కొండ అర్జున్ మాట్లాడుతూ రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయడం అభినందనీయమన్నారు. కుటుంబాల భద్రత, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రవేశపెడుతున్న ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని కొండ అర్జున్ పేర్కొన్నారు.


Comments