నిరుద్యోగ యువతకు అండగా కరెంట్ అఫైర్స్ పుస్తకాల పంపిణీ.
రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.. లేదా రెండు ఎమ్మెల్సీలను ఓడగొట్టాలి
యూత్ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలి..
నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ న్యాయపోరాటం చేసింది
నన్ను చట్టసభకు పంపితే మీ గొంతుకగా నిలబడతా.. మీ గౌరవం పెరిగేలా పనిచేస్తా
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి

వరంగల్,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు):
నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తూ, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి అన్నారు. లైబ్రరీలు, కోచింగ్ కేంద్రాల సందర్శన కార్యక్రమంలో భాగంగా గురువారం వరంగల్ ప్రాంతీయ గ్రంథాలయాన్ని సందర్శించిన ఆయన వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువత, విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు కరెంట్ అఫైర్స్ బిట్స్ పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆశలను నెరవేర్చకుండా కాలయాపన చేయడం తగదని, రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.. లేదంటే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఓడగొట్టేలా నిరుద్యోగ యువత తమ నిరసనను తెలియజేయాలని పిలుపునిచ్చారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వానికి ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలను తక్షణమే అమలు చేయాలని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు. నిరుద్యోగ యువత సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ గతంలో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా న్యాయపోరాటం కూడా చేసిందని, యువతకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సంబంధించి 3.8 మీటర్ల లాంగ్ జంప్ అర్హత నిబంధనను ప్రభుత్వం పునఃసమీక్షించాలని కోరారు. ఈ నిబంధన కారణంగా ఎంతోమంది అభ్యర్థులు తదుపరి దశకు అర్హత సాధించలేక అవకాశాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిబంధనలను పునఃపరిశీలించి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు భారీ సంఖ్యలో పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గిరిజన, ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో న్యాయం జరిగేలా 75 శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. గ్రూప్-1 నియామకాలు, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలకు సంబంధించి వస్తున్న అవకతవకల ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని, అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు చిన్న సహకారం..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నాణ్యమైన అధ్యయన సామగ్రి అందించాలనే ఉద్దేశంతో కరెంట్ అఫైర్స్ బిట్స్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని రాకేశ్ రెడ్డి తెలిపారు. ఒక ఉద్యోగం సాధించేందుకు విద్యార్థులు పడుతున్న కష్టం, వారి కుటుంబాలు పెట్టుకున్న ఆశలు తనకు తెలుసన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా లక్ష్య సాధన కోసం శ్రమిస్తున్న నిరుద్యోగ యువతకు తమ వంతుగా సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. పుస్తకాల పంపిణీ చిన్న సహకారమే అయినప్పటికీ, విద్యార్థుల విజయ ప్రయాణంలో అండగా నిలవాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు.
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..
గత 14 ఏళ్లుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తున్నానని రాకేశ్ రెడ్డి అన్నారు. తాను ఈ ప్రాంత బిడ్డనని, ఇక్కడి విద్యార్థులు, నిరుద్యోగ యువత, పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణం, ప్రజలతో ఉన్న అనుబంధం, చేసిన పోరాటాలు ప్రజలందరికీ తెలుసని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు.
తనకు చట్టసభలో ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తే పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలను బలంగా వినిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల గొంతుకగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని, తనపై నమ్మకంతో బాధ్యత అప్పగిస్తే ప్రజల గౌరవం పెరిగేలా, ఈ ప్రాంత ప్రతిష్ఠ ఇనుమడించేలా పనిచేస్తానని అన్నారు. పదవుల కోసం ప్రజల వద్దకు రావడం కాకుండా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆశయాలు నెరవేరి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించినప్పుడే వారి కుటుంబాల్లో నిజమైన ఆనందం వెల్లివిరుస్తుందని రాకేశ్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు కొనుకటి ప్రశాంత్, పిన్నింటి విజయ్, గువ్వ రాజేష్, ఎలీషా, జన్ను విద్యా, షరీఫ్, యువజన నాయకులు పురుషోత్తం, రమేష్, రేవంత్, వంశీ రెడ్డి, వాసు, జన్ను యువరాజు, రాకేష్తో పాటు పలువురు నిరుద్యోగ యువత, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments