ఉద్యమకారుల హక్కుల కోసం మేడారం నుంచి మరో పోరుబాట.
* కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలి
* ఎక్కడి సంజీవరెడ్డి
జమ్మికుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, అలుపెరుగని పోరాటాలు సాగించిన ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఎక్కడి సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 22న మేడారంలో నిర్వహించనున్న సమ్మక్క–సారలమ్మ చలో మేడారం మహాపాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గురువారం జమ్మికుంటలో చలో మేడారం మహాపాదయాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను సైతం పక్కనపెట్టి పోరాటం చేశారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందని పేర్కొన్నారు. అలాంటి ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, గౌరవం, ప్రభుత్వపరమైన భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చిందని, వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. హామీలను ప్రకటనలకే పరిమితం చేయకుండా తక్షణమే అమలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈనెల 22వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు మేడారంలోని జంపన్న వాగు నుంచి సమ్మక్క–సారలమ్మ గద్దెల వరకు మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. సమ్మక్క–సారలమ్మల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఉద్యమకారుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఉద్యమకారుడు ఈ పాదయాత్రలో పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. ఉద్యమ సంఘాలు, ప్రజాసంఘాలు, తెలంగాణ అభిమానులు ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ, ములుగు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో మహాపాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర సెక్రటరీ జనరల్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎక్కడి సంజీవరెడ్డి, జిల్లా నాయకులు మూడెడ్ల కుమారస్వామి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఆరె రమేష్ రెడ్డి, మోతె స్వామి, పాతకాల ఓదెలు, బిట్ల శ్రీనివాస్, ఇల్లందుల శ్రీనివాస్, ఎజ్జ తిరుపతి, పోచం వెంకన్న, కన్నూరి శ్రీనివాసు, గడ్డి కొమురయ్య, గడ్డి రాములు, తోడేటి జితేందర్, యమ శ్రీనివాసు, అన్నారపు వీరస్వామి, గాజ రాజయ్య, అబ్బీడి శ్రీపాల్ రెడ్డి, దాసరి తిరుపతిరెడ్డి, బండి మల్లయ్య, ఉప్పుల మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Comments