రైతు బీమా విధానంపై ప్రభుత్వం పునరాలోచించాలి.
అర్హులైన ప్రతి రైతుకు రూ.5 లక్షల బీమా కల్పించాలి
-- అల్వాల వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు
పెద్దమందడి,నవంబర్19(తెలంగాణ ముచ్చట్లు):
రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన రైతు బీమా పథకంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై పునరాలోచన చేయాలని బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఒక గుంట భూమి కలిగిన రైతుకు సైతం రూ.5 లక్షల రైతు జీవిత బీమా సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. ఒకే కుటుంబంలో ఎంతమంది అర్హులైన రైతులు ఉంటే అంతమందికి వ్యక్తిగతంగా బీమా వర్తించేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు.ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఒక కుటుంబానికి ఒక్కరికే బీమా వర్తింపజేస్తే, అదే కుటుంబంలో వ్యవసాయం చేస్తున్న మిగతా రైతులు బీమా సౌకర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల రైతు కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం రేషన్ కార్డు నిబంధనపై పునరాలోచించి, భూమి కలిగి వ్యవసాయం చేస్తున్న ప్రతి అర్హ రైతుకు వ్యక్తిగతంగా రూ.5 లక్షల రైతు జీవిత బీమా కల్పించాలని కోరారు. రైతులందరికీ సమాన న్యాయం జరిగేలా గతంలో అమలైన రైతు బీమా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.రైతుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని అల్వాల వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.


Comments