ఇందిరమ్మ ఆశయాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి మార్గదర్శకం.
* అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
* వొడితల ప్రణవ్
ఇల్లందకుంట, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కృషి చేసిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సేవలు చిరస్మరణీయమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆమె చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.
గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో ప్రణవ్ పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని తెలిపారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు పెన్షన్ల ద్వారా చేయూతనిస్తున్నామని పేర్కొన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గానికి కొత్తగా 4,336 పెన్షన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. గురువారం సిద్ధిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నారని, ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు నిధులు అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని ప్రణవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments