సరకా లేబొరేటరీస్‌లో వరుస భద్రతా వైఫల్యాలు!

సరకా లేబొరేటరీస్‌లో వరుస భద్రతా వైఫల్యాలు!

కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు నోటీసులు ఇచ్చినా మారని యాజమాన్యం

 తీరు క్లోరోఫామ్ విషవాయువు లీకై ఇద్దరి మృతి.. 

సిగాచి ఘటన తర్వాత కూడా పరిశ్రమల భద్రతపై నిర్లక్ష్యమెందుకు? 

సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: మెట్టు శ్రీధర్

సంగారెడ్డి,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు): 

పరిశ్రమల భద్రతా వైఫల్యాలు మరోసారి అమాయకుల ప్రాణాలను బలిగొన్నాయి. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలోని సరకా లేబొరేటరీస్ పరిశ్రమలో క్లోరోఫామ్ విషవాయువు లీకై ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నవభారత్ నిర్మాణ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ అన్నారు. గతంలోనే కాలుష్య నియంత్రణ మండలి పలుమార్లు నోటీసులు, ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిశ్రమలో భద్రతా లోపాలు కొనసాగడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.

ఈ పరిశ్రమకు సంబంధించిన అనుమతులు, కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన నోటీసులు, అధికారుల తనిఖీలు, గేదెల మరణాలపై తీసుకున్న చర్యలు, తాజా ప్రమాదం, పరిశ్రమ మూసివేత ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం-2005 ద్వారా అధికారికంగా సేకరించినట్లు మెట్టు శ్రీధర్ వెల్లడించారు. నవంబర్ 19న అందిన సమాచారంలో పరిశ్రమలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న పర్యావరణ, భద్రతా సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

ఏళ్లుగా నోటీసులు.. అయినా మారని తీరు!

కాలుష్య నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం సరకా లేబొరేటరీస్‌కు 2020 నవంబర్ 23, 2021 అక్టోబర్ 7, డిసెంబర్ 1, 2023 సెప్టెంబర్ 13 తేదీల్లో ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడైందన్నారు. అంతేకాకుండా 2025 ఫిబ్రవరి 8, 2026 మార్చి 13, ఆగస్టు 6 తేదీల్లోనూ నిబంధనల ఉల్లంఘనలు, అనుమతి షరతుల అమలుకు సంబంధించి తదుపరి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇన్ని సందర్భాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ పరిశ్రమలో భద్రతా లోపాలు ఎందుకు కొనసాగాయి? నిబంధనల అమలును అధికారులు ఎంతవరకు పర్యవేక్షించారు? లోపాలు గుర్తించినప్పుడు ముందుగానే కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గేదెల మరణాలపై విచారణ ఏమైంది?

సదరు పరిశ్రమ కారణంగా గేదెల మరణాలు సంభవించిన అంశంపై 2024 సెప్టెంబర్ 19, 2025 జనవరి 31 తేదీల్లో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి లేఖలు రాసినట్లు అధికారిక పత్రాల్లో పేర్కొన్నారని శ్రీధర్ తెలిపారు. రెవెన్యూ, పశువైద్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో విచారణ జరిపించి గేదెల మరణాలకు కారణాలను గుర్తించాలని, బాధితులకు పరిహారం చెల్లించాల్సిన అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కోరినట్లు వివరించారు. అయితే ఆ విచారణలో ఏం తేలింది? బాధిత పశువుల యజమానులకు పరిహారం అందిందా? పరిశ్రమపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే వివరాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలని కోరారు.

క్లోరోఫామ్ లీకేజీతో ఇద్దరి ప్రాణాలు బలి

2026 అక్టోబర్ 22 రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో పరిశ్రమలోని ఉత్పత్తి విభాగం-2లో రియాక్టర్ నుంచి లేయర్ సెపరేషన్ జరుగుతున్న సమయంలో క్లోరోఫామ్ విషవాయువులు లీకైనట్లు అధికారుల తనిఖీ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. ప్రమాద సమయంలో రియాక్టర్‌లో సుమారు 1,750 లీటర్ల క్లోరోఫామ్ సెపరేషన్ లేయర్ ఉన్నట్లు పరిశ్రమ అధికారులు వెల్లడించినట్లు వివరించారు. విషవాయువుల ప్రభావానికి గురైన ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితికి చేరుకోవడంతో నారాయణ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించినట్లు నివేదికలో నమోదైందన్నారు.

తనిఖీల్లో బయటపడ్డ భద్రతా లోపాలు

అక్టోబర్ 23న నిర్వహించిన తనిఖీల్లో స్క్రబ్బర్ వెంటిలేషన్ పైప్, హెచ్‌డీపీఈ వాల్వ్ దెబ్బతినడం, స్క్రబ్బర్ డక్ట్ సమీపంలో లీకేజీ అవశేషాలు కనిపించడం, ప్రమాద ప్రాంతంలో క్లోరోఫామ్ వాసన కొనసాగడం వంటి అంశాలను అధికారులు గుర్తించినట్లు మెట్టు శ్రీధర్ తెలిపారు. ప్రమాద ప్రాంతంలో వీఓసీ స్థాయి 20 పీపీఎం వరకు నమోదవగా, ఉత్పత్తి విభాగం వెలుపల 0.1 పీపీఎం నమోదైనట్లు తనిఖీ నివేదికలో పేర్కొన్నారని వివరించారు.

అంతేకాకుండా క్లోరోఫామ్ లీకేజీని ముందుగానే గుర్తించేందుకు అలారం సౌకర్యంతో కూడిన సెన్సార్లు ఏర్పాటు చేయకపోవడం, డబుల్ స్టేజ్ స్క్రబ్బర్ ఉన్నప్పటికీ యాక్టివేటెడ్ చార్కోల్ బెడ్‌తో కూడిన సబ్ కూలర్ కండెన్సర్ లేకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదకర రసాయనాలతో పనిచేసే పరిశ్రమలో ఇలాంటి కీలక భద్రతా ఏర్పాట్లు లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

ప్రమాదం తర్వాతే స్పందిస్తారా?

ఇటీవల సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని శ్రీధర్ అన్నారు. సిగాచి దుర్ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదకర పరిశ్రమల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారా? భద్రతా ఆడిట్లు చేపట్టారా? గుర్తించిన లోపాలను సరిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత హడావుడిగా స్పందించడం కాకుండా, ముందస్తు తనిఖీల ద్వారా ప్రమాదాలను నివారించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు.

పరిశ్రమ మూసివేతకు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు

తనిఖీల్లో గుర్తించిన లోపాలు, భద్రతా చర్యల అమలులో వైఫల్యాలను పరిగణనలోకి తీసుకున్న కాలుష్య నియంత్రణ మండలి 2026 అక్టోబర్ 23న సరకా లేబొరేటరీస్ మూసివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీధర్ వెల్లడించారు. నీటి కాలుష్య నివారణ చట్టంలోని సెక్షన్ 32, 33(ఏ), వాయు కాలుష్య నివారణ చట్టంలోని సెక్షన్ 31(ఏ) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

పరిశ్రమకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థను ఆదేశించడంతో పాటు 48 గంటల్లో అమలు నివేదిక సమర్పించాలని కోరినట్లు వివరించారు. అలాగే పరిశ్రమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, ప్రమాదం కారణంగా ఏర్పడిన కలుషిత మురుగునీరు, వ్యర్థాలను సేకరించి తగిన శుద్ధి వ్యవస్థలకు పంపాలని ఆదేశించినట్లు తెలిపారు. ఉత్తర్వులను ఉల్లంఘించి పరిశ్రమను కొనసాగిస్తే సంబంధిత చట్టాల ప్రకారం ప్రాసిక్యూషన్, జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

అనుమతులున్నా భద్రతా బాధ్యత తప్పదు

మరోవైపు పరిశ్రమకు 2026 మార్చి 2న ఆటో రెన్యూవల్ ద్వారా నిర్వహణ అనుమతి మంజూరై 2031 మార్చి 31 వరకు గడువు ఉన్నట్లు అధికారిక పత్రాల్లో వెల్లడైందని శ్రీధర్ తెలిపారు. అయితే నిర్వహణ అనుమతి ఉన్నంత మాత్రాన పర్యావరణ పరిరక్షణ, కార్మికుల భద్రత, ప్రమాద నివారణ నిబంధనలను పాటించాల్సిన బాధ్యత నుంచి పరిశ్రమ యాజమాన్యానికి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.

సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

సరకా లేబొరేటరీస్‌లో జరిగిన ప్రమాదంపై ఉన్నతస్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని మెట్టు శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ప్రతి నోటీసు, ఆదేశం అమలుపై సమగ్రంగా పరిశీలించాలని, గేదెల మరణాలపై జరిగిన విచారణ నివేదికను, బాధితులకు అందించిన పరిహారం వివరాలను బహిర్గతం చేయాలని కోరారు. తాజా ప్రమాదానికి యాజమాన్య నిర్లక్ష్యం లేదా భద్రతా వైఫల్యాలు కారణమని విచారణలో తేలితే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన ఇద్దరి కుటుంబాలకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

గడ్డపోతారం, పాశమైలారం పారిశ్రామిక ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రమాదకర పరిశ్రమల్లో ప్రత్యేక భద్రతా తనిఖీలు నిర్వహించాలని కోరారు. రసాయనాల నిల్వ, వినియోగం, విషవాయువుల లీకేజీని గుర్తించే సెన్సార్లు, అత్యవసర స్పందన వ్యవస్థలు, కార్మికుల రక్షణ పరికరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

గతంలో జరిగిన సిగాచి దుర్ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని, పరిశ్రమల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా కఠిన పర్యవేక్షణ చేపట్టాలని మెట్టు శ్రీధర్ పేర్కొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కార్మికులు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు రాకూడదని, మరో ప్రమాదం జరగకముందే ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News