హుజూరాబాద్‌లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు.
*భక్తిశ్రద్ధలతో మహాగణపతి హోమం, పంచసూక్త పారాయణం – పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు,*
హుజురాబాద్,నవంబర్ 19(తెలంగాణ ముచ్చట్లు ):
హుజూరాబాద్ పట్టణంలోని బోర్నపల్లి రోడ్డులో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఉదయం నుంచి మండప పూజలు, అష్టదిక్పాలక హోమం, విశ్వాంబర పూజ, స్వస్తివాచనం, మహాగణపతి హోమం, పంచసూక్త పారాయణం, కుంకుమార్చన, దీపారాధన, పుష్పాభిషేకం, వేద పఠనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. స్వామీజీ విద్యా ప్రసన్న తీర్థ స్వామివారిని భక్తులు దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఆలయ ప్రాంగణమంతా భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ వేడుకల్లో మాజీ ఎంపీ వొడితెల లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రధాన పూజారి పండిత్ బాస్కర్ శర్మ, దేవస్థానం కమిటీ అధ్యక్షుడు దొంత రమేష్, కార్యదర్శి అంగిరేక ప్రసాద్, కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.


Comments