జమ్మికుంట వేదికగా ఎస్ఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలు.
* మహాసభలను విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి
* జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్
జమ్మికుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కరీంనగర్ జిల్లా 19వ మహాసభలను డిసెంబర్ 2, 3 తేదీల్లో జమ్మికుంట మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ తెలిపారు. ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాన్ని ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో జమ్మికుంట వొకేషనల్ కళాశాలలో ఆవిష్కరించారు. తొలిసారిగా జమ్మికుంటలో నిర్వహిస్తున్న ఈ మహాసభలను విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన ఘనత ఎస్ఎఫ్ఐకి ఉందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ, భవిష్యత్తులో చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణకు ఈ మహాసభలు వేదిక కానున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టాలు, విధానాల పేరుతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంటోందని అన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా 19వ మహాసభల్లో విద్యారంగ సమస్యలపై సమగ్రంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జమ్మికుంట మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధిక్, అనిల్, నాయకులు మహేష్, అక్షయ్, అలీ, మహేందర్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.


Comments