ప్రతి కుటుంబానికి అండగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం.
*హుజురాబాద్‌లో పథకాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మనోజ్ రావు*
*ఐదు వార్డుల అర్హులైన లబ్ధిదారులకు జీవిత బీమా నమోదు పత్రాల పంపిణీ*
హుజురాబాద్,నవంబర్ 20(తెలంగాణ ముచ్చట్లు ):
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని హుజురాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్ రావు ప్రారంభించారు. పట్టణంలోని మాతృశ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 22వ, 23వ, 25వ, 29వ, 30వ వార్డులకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు జీవిత బీమా నమోదు పత్రాలను ఆమె అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడంతో పాటు, అనుకోని ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్కర పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
సాధారణ కుటుంబాలు భవిష్యత్తుపై భరోసాతో జీవించేందుకు ఇటువంటి సంక్షేమ పథకాలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు సమాజంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా అర్హులైన కుటుంబాలు పథకంలో నమోదు చేసుకునేలా అధికారులు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
హుజురాబాద్ పట్టణంలోని వివిధ వార్డుల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి పథకం ప్రయోజనాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, బీమా నమోదు ప్రక్రియకు సంబంధించి అవసరమైన వివరాలను అధికారులకు అందించి పథకంలో భాగస్వాములు కావాలని కోరారు.
ప్రజల జీవన భద్రతకు, కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఒక ముఖ్యమైన కార్యక్రమమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు భవిష్యత్తులో ఆర్థిక భద్రతపై నమ్మకం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. కిషన్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కిరణ్, అకౌంట్ సెక్షన్ గోపాల్, సంబంధిత వార్డుల కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments