బీమా కాదు.. బతకడానికి ఇల్లు కావాలి! పేదల ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?
ఎల్కతుర్తి నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సామాన్య పేద ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపై తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండడానికి సొంత ఇల్లు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ తమకు ఇప్పటికీ ఇళ్లు మంజూరు కావడం లేదని వాపోతున్నారు. ఒకవైపు ఇందిరమ్మ బీమా పథకం తీసుకొస్తుండగా, మరోవైపు ఇల్లు లేని పేదల పరిస్థితి మాత్రం అలాగే ఉందని ప్రశ్నిస్తున్నారు.
బీమా పథకం మంచిదే.. కానీ ఇల్లు లేని పేదల సంగతేంటి?
ప్రభుత్వం తీసుకొస్తున్న ఇందిరమ్మ బీమా పథకాన్ని తాము వ్యతిరేకించడం లేదని, పేద కుటుంబాలకు బీమా భరోసా కల్పించడం మంచి నిర్ణయమేనని ప్రజలు అంటున్నారు. అయితే బీమా పథకంతో పాటు సొంత ఇల్లు లేని నిరుపేదల సమస్యను కూడా ప్రభుత్వం గుర్తించాలని కోరుతున్నారు. బీమా వద్దనడం లేదని, తమకు కావాల్సింది కూడా ఆర్థిక భద్రతేనని, కానీ ముందుగా ఉండడానికి ఒక గూడు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఒకవైపు బీమా ప్రకటనలు.. మరోవైపు పూరిగుడిసెల్లో పేదల బతుకులు!
“మాకు బీమా పథకం వద్దని చెప్పడం లేదు.. అది కూడా పేదలకు ఉపయోగపడే పథకమే. కానీ మాకు ఉండడానికి ఇల్లు లేదు. వర్షం వస్తే ఇల్లు కురుస్తుంది.. ఎండ వస్తే నిలువ నీడ ఉండదు. ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగినా మాకు ఇల్లు మంజూరు కావడం లేదు. ఒకవైపు బీమా పథకం తీసుకొస్తున్నారు.. మరోవైపు మేము మాత్రం పూరిగుడిసెల్లోనే బతుకుతున్నాం. మా పరిస్థితి ఎప్పుడు మారుతుంది?” అంటూ సామాన్య పేద ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరికొన్ని కుటుంబాలు శిథిలావస్థకు చేరిన గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నాయి. ఎన్నికల సమయంలో సొంతింటి కల నెరవేరుతుందని ఆశించామని, ఇప్పటికైనా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతున్నారు.
పేదవాడికి బీమా భరోసాతో పాటు సొంతింటి భరోసా ఎప్పుడు?
“మా పిల్లలు సొంతింట్లో ప్రశాంతంగా ఉండే రోజులు ఎప్పుడు వస్తాయి? బీమా పథకం మంచిదే.. దాన్ని మేము వద్దనడం లేదు. కానీ ఇల్లు లేని పేదవాడి బాధను కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మాకు హామీలు కాదు.. ఆచరణలో ఇళ్లు కావాలి” అంటూ ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిజమైన నిరుపేదలను గుర్తించి, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బీమా పథకంతో పాటు సొంతింటి కలను కూడా నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


Comments