ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
*రూ.5 లక్షల కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరం సందర్శన.*
*అర్హులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచన.*
కరీంనగర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కరీంనగర్ నగరంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు శుక్రవారం సంబంధిత నమోదు శిబిరాన్ని సందర్శించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. పథకానికి సంబంధించిన అర్హతలు, నిబంధనలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. కుటుంబాన్ని పోషించే 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వ్యక్తి ఈ బీమాకు అర్హులని, వయస్సు ధ్రువీకరణకు ఆధార్ కార్డు ప్రతిని ప్రాతిపదికగా తీసుకుంటున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, సమీపంలోని మున్సిపల్ కార్యాలయం లేదా వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినుద్దీన్, ఆర్ఐలు కలీముల్లా ఖాన్, కొత్తకొండ శ్యామ్ సుందర్, వార్డు ఆఫీసర్ పారిపెల్లి రాజు, జవాన్ నాగరాజు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.


Comments