పోతిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం.
పేద కుటుంబాలకు జీవిత బీమా కొండంత భరోసా.. కాంగ్రెస్ నాయకులు.
వీణవంక, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని దేవస్థానంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని, కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామంలోని అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో గ్రామ కార్యదర్శిని సంప్రదించి వెంటనే జీవిత బీమా నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పంజాల సతీష్ గౌడ్, చేపూరి రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు రాపర్తి రవి, ఉప సర్పంచ్ రాపర్తి సంధ్య, కొమురయ్య గౌడ్, ఆరో వార్డు సభ్యుడు చేపూరి శ్రీకాంత్, చందుపట్ల శ్రీధర్ రెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


Comments