సొంతింటి కల నెరవేర్చుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం.
ఇల్లందకుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడంతో పాటు ఆర్థిక భరోసా లభిస్తోందని పేర్కొన్నారు.
శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ పరిధితో పాటు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రం, లక్ష్మాజిపల్లి గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలు, నూతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసే కార్యక్రమాలకు ప్రణవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన గృహాల్లోకి అడుగుపెడుతున్న లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కల ఉండేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా తమ కోరిక నెరవేరిందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల అమలుతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్తోందన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో హుజూరాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ సుహాసిని, వివిధ గ్రామాల సర్పంచులు, జమ్మికుంట పట్టణ నాయకులు, ఇల్లందకుంట మండల నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Comments