గురువుపై గౌరవం.. రెండు దశాబ్దాలైనా చెరగని అనుబంధం.
* గురువు కుమార్తె వివాహానికి రూ.90 వేల ఆర్థిక సాయం
* కాకతీయ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఔదార్యం
జమ్మికుంట, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):
గురువు నేర్పిన విద్యాబుద్ధులు, చూపిన మార్గం విద్యార్థుల జీవితాల్లో ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో కాకతీయ హైస్కూల్ 2004–05 పదో తరగతి పూర్వ విద్యార్థులు తమ ఆచరణతో చాటిచెప్పారు. చదువు చెప్పిన గురువు భౌతికంగా దూరమైనా ఆయనపై గౌరవం, ఆయన కుటుంబంపై ఆప్యాయతను రెండు దశాబ్దాలైనా మరువకుండా గురువు కుమార్తె వివాహానికి ఆర్థిక సహాయం అందించి తమ గురుభక్తిని చాటుకున్నారు.
జమ్మికుంటలోని కాకతీయ హైస్కూల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ గురువు కీర్తిశేషులు బుర్ర సంజీవ్ ప్రథమ కుమార్తె మధుహాసిని–సాయికృష్ణ వివాహాన్ని పురస్కరించుకుని మొత్తం రూ.90 వేల ఆర్థిక సహాయాన్ని సమకూర్చి అందజేశారు. ఇందులో రూ.60 వేల నగదును చెక్కు రూపంలో, రూ.15 వేల విలువైన బీరువా, కూలర్‌ను 2005–06 బ్యాచ్ విద్యార్థుల తరఫున అందించారు. మరో రూ.15 వేలతో చిన్నారి కళాశాల ఫీజు చెల్లించి కుటుంబానికి అండగా నిలిచారు.
గతంలో 2012లో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలోనూ గురువు సంజీవ్ కుటుంబానికి రూ.35 వేల ఆర్థిక సహాయం అందించడం విశేషం. గురువు భౌతికంగా తమ మధ్య లేకపోయినా ఆయన నేర్పిన విలువలు, అందించిన విద్య, మధుర జ్ఞాపకాలు తమ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని పూర్వ విద్యార్థులు ఈ సందర్భంగా మరోసారి నిరూపించారు.
వివాహ వేడుకకు హాజరైన బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పూర్వ విద్యార్థులు గురువు కుటుంబంపై చూపిన ప్రేమాభిమానాలు, బాధ్యత, సేవాభావాన్ని అభినందించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువు కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి వారి కష్టసుఖాల్లో తోడుగా నిలవడం సమాజానికి గొప్ప సందేశమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అంబీరి శ్రీకాంత్, జక్కు రజనీకాంత్, పైండ్ల రాజేష్ రెడ్డి, పిల్లల శ్రీనివాస్, నాగలగని మధు, వొల్లల అజయ్, పలకల చంద్ర రెడ్డి, కండెం రాజేష్, పొద్దుటూరి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గురువుపై గౌరవం, మానవత్వం, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే సేవాభావం ఉంటే సమాజంలో మంచి మార్పులు సాధ్యమవుతాయని ఈ పూర్వ విద్యార్థులు తమ సేవా కార్యక్రమంతో చాటిచెప్పారు.


Comments