44వ డివిజన్లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం.
*ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే నా లక్ష్యం*
*ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్*
ఖమ్మం బ్యూరో , నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఖమ్మం నగరంలోని 44వ డివిజన్లో కాంగ్రెస్ నాయకుడు గుడిపూడి జగదీష్ ఆధ్వర్యంలో విస్తృత ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, ఖమ్మం అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గుడిపూడి జగదీష్ స్వయంగా డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. పథకం ఉద్దేశ్యం, ప్రయోజనాలు, అర్హతలు, నమోదు ప్రక్రియ తదితర అంశాలను ప్రజలకు వివరించారు. కుటుంబ పెద్దకు జీవిత భద్రత కల్పించడం ద్వారా ఆపద సమయంలో కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలవడమే ఇలాంటి సంక్షేమ పథకాల ప్రధాన ఉద్దేశమని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలు తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో 2026 డిసెంబర్ 4వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు 44వ డివిజన్లోని భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద సంబంధిత అధికారులకు అవసరమైన పత్రాలు అందజేసి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని,
ఎవరూ సమాచారం లేక పథకానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.
అనంతరం గుడిపూడి జగదీష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, యువ నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ఎల్లప్పుడూ 44వ డివిజన్ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. వారి సూచనలు, సహకారంతో డివిజన్ ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, నాయకులు అప్పగించిన ప్రతి బాధ్యతను ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్వహించడమే తన లక్ష్యమని, ముఖ్యంగా ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించి అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల ఆదరాభిమానాలతో మరింత బాధ్యతగా పనిచేస్తూ సంక్షేమం, అభివృద్ధిలో 44వ డివిజన్ను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ హుస్సేన్,
44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాచర్ల తిరుమలరావు, సీ.పీ.ఐ నగర కార్యవర్గ సభ్యుడు దాడి, లంబాడి రాష్ట్ర కార్యదర్శి డుంగ్రోత్ శేఖర్, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments