సదర్ ఉత్సవాలతో యాదవుల ఐక్యత చాటాలి.
*కాపు–యాదవ సోదరభావం మరింత బలోపేతం కావాలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపు.*
కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
యాదవుల ఐక్యతకు, ఆత్మగౌరవానికి, సంప్రదాయాలకు సదర్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. యాదవుల ఐక్యతను చాటిచెప్పే సదర్ ఉత్సవాలను ప్రతి ఏటా కరీంనగర్ నగరంలో అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలుపుకొని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. యాదవులంటే నమ్మకానికి, ధైర్యసాహసాలకు మారుపేరని కొనియాడారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నవీన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సదర్ ఉత్సవ ప్రతినిధులతో కలిసి శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ కొట్టి, పూలు సమర్పించి జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారాయణుడి అవతారమైన శ్రీకృష్ణ భగవానుడి వారసులుగా యాదవులు ఆయన సంప్రదాయాలను కొనసాగిస్తున్నారని అన్నారు. సమాజంలో యాదవులకు ప్రత్యేకమైన నమ్మకం, గౌరవం ఉందని, అన్ని రాజకీయ పార్టీల్లోనూ వారికి సముచిత స్థానం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ యాదవుల ఐక్యతను చాటిచెప్పడం అభినందనీయమన్నారు.
*యాదవ–కాపు బంధం మరింత బలపడాలి.*
మల్లన్న స్వామి యాదవులకు ఇలవేల్పు అని, కాపు సోదరులకు కూడా మల్లన్న స్వామితో విడదీయలేని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని గంగుల కమలాకర్ తెలిపారు. మల్లన్న స్వామి సంప్రదాయాలు, పట్నాల నిర్వహణ రెండు వర్గాల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధానికి ప్రతీకలని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో యాదవులు, కాపుల మధ్య కొనసాగుతున్న సోదరభావం మరింత బలోపేతం కావాలని, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
*కరీంనగర్లో ఏటా సదర్ సంబరాలు జరగాలి.*
ఈసారి సదర్ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ చౌక్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం సర్కస్ గ్రౌండ్లో కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కొంత ఆలస్యమైనప్పటికీ అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు అనువైన ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహించడం అవసరమన్నారు. దూర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తే గ్రామీణ ప్రజలు హాజరుకావడానికి ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా కరీంనగర్ నగరంలోనూ అన్ని కులాలు, వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇందుకోసం తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. యాదవ సోదరులందరూ ఐక్యంగా ఉంటూ తమ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలని కోరారు. సదర్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన యాదవ సోదరులందరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నవీన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సదర్ ఉత్సవ ప్రతినిధులు, యాదవ సంఘాల నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Comments