అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.
--- కార్డుల జారీలో డీపీఆర్ఓ నిర్లక్ష్యం వీడాలి
--- రెండు, మూడు రోజుల్లో కార్డులు ఇవ్వకుంటే కార్యాలయం ముట్టడి, అవసరమైతే ఆమరణ దీక్ష
--- జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల స్థలాన్ని పరిశీలించిన ఫెడరేషన్ జిల్లా నేతలు
--- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్
ఖమ్మం బ్యూరో , నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు )
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల స్థలాన్ని ఫెడరేషన్ నేతలు పరిశీలించారు. అలాగే అర్హులైన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం డిసెంబరు 5 నుంచి 9 వరకు నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీయూడబ్ల్యూజే) జిల్లా అధ్యక్షులు సయ్యద్ ఖదీర్ మాట్లాడుతూ... కేబుల్ టీవీ, కార్పొరేషన్ పరిధితో పాటు ఏ,బీ,సీ గ్రేడ్లలోని చిన్న, మధ్య, పెద్ద పత్రికల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అనేక రకాల కారణాల పేరుతో, సాంకేతిక లోపాలు చూపుతూ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. గతంతో పోలిస్తే ఎక్కువ ప్రెస్ అకాడమీ కార్డులు ఇచ్చామని చెబుతూనే, మరోవైపు కొర్రీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది నిరంతర ప్రక్రియ, నిర్విరామంగా కొనసాగే ప్రక్రియ అని చెబుతూనే జర్నలిస్టులకు అనేక రకాలుగా అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపుగా ఏడు నెలల సమయం గడిచిపోయినా నేటివరకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయకుండా తాత్సారం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదని, మిగతా కార్డులను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకం అమలు కావాలన్నా, ఆరోగ్య రీత్యా హెల్త్ కార్డు రావాలన్నా, రవాణా సదుపాయం కల్పించాలన్నా అక్రిడిటేషన్ కార్డు ఒక క్రైటీరియాగా ఉందని, కవరేజీకి వెళ్లే క్రమంలో కార్డులు లేక జర్నలిస్టులు అనేక చోట్ల నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పటికైనా ఇక్కడున్న డీపీఆర్ఓ, అక్రిడిటేషన్ కమిటీ, దాంతోపాటు జిల్లా కలెక్టర్ రాబోయే రెండు,మూడు రోజుల్లో ప్రింటింగ్ దశలో ఉన్నాయని, సాంకేతిక లోపాలని రకరకాలుగా చెప్పి ఆపిన పెండింగ్ కార్డులను పూర్తిచేసి అర్హులైన జర్నలిస్టులందరికీ అందజేయాలని డిమాండ్ చేశారు. మరలా ఇదే కాలయాపన జరిగితే ఊరుకునేదే లేదని, రాష్ట్ర కమిటీతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా డీపీఆర్ఓ కార్యాలయాల వద్ద ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఒకవేళ దానికి కూడా స్పందించకపోతే కార్డులు రాని జర్నలిస్టులందరినీ తీసుకొని అవసరమైతే కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి కి టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నేతలు వినతిపత్రం అందజేసి పెండింగ్ లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను, కేబుల్ ఛానల్ కు కూడా అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అందుకు స్పందించిన డిఆర్ఓ.. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు నాగేందర్ రెడ్డి, టీఎస్ చక్రవర్తి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ నలుబోలు మధుశ్రీ, టీబీసీఏ జిల్లా కార్యదర్శి మానుకొండ రవికిరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కొత్త యాకేష్, జిల్లా కమిటీ సభ్యులు గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కె. సుధాకర్ (సత్తుపల్లి), ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దగ్గుపాటి మాధవరావు, కొరకొప్పుల రాంబాబు, టీబిజెఏ కెమెరామెన్ అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్, గణేష్, యాకూబ్ పాషా, శరత్, అర్షద్, అశోక్, హరి, పవన్, బండి కుమార్ ఖమ్మం టౌన్ రిపోర్టర్లు గోపి, కిరణ్, రవి, సైదులు సత్తుపల్లి రిపోర్టర్లు, ఆనంద్, బాజీ, క్రాంతి, ప్రసాద్, చారి, చంద్రశేఖర్, పాలేరు రిపోర్టర్లు లక్ష్మారెడ్డి, యన్.డి కర్ణ, అచ్యుతరామారావు, వెంకట్, స్వరూప్, రాధాకృష్ణ, గోపి, గంగాధర్, నాగలక్ష్మి, శ్రీదేవి, వైరా రిపోర్టర్లు గుడిమెట్ల మోహన్ రావు, చారి, భూక్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


Comments