వరంగల్‌ పశ్చిమలో రాజకీయ దుమారం.. బీఆర్‌ఎస్‌ మెరుపు ధర్నా!

వరంగల్‌ పశ్చిమలో రాజకీయ దుమారం.. బీఆర్‌ఎస్‌ మెరుపు ధర్నా!

నాయిని క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం.. పోలీసుల స్వల్ప లాఠీచార్జి

సవాళ్లు.. ప్రతిసవాళ్లతో వేడెక్కిన రాజకీయం.. బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం

ప్రతిఆందోళనకు కాంగ్రెస్‌ శ్రేణుల సన్నద్ధత?

హనుమకొండ, నవంబర్‌ 24 (తెలంగాణ ముచ్చట్లు):

సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. నిరసనలు.. ప్రతినిరసనలతో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ మధ్య సాగుతున్న రాజకీయ విమర్శలు ఇప్పుడు వీధి పోరాటాలకు దారితీశాయి. సోమవారం ఇరువురు నేతలు పరస్పరం విసురుకున్న సవాళ్ల నేపథ్యంలో మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు ఎమ్మెల్యే నాయిని క్యాంపు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు కారణమైంది. క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో స్వల్ప లాఠీచార్జి జరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

కేటీఆర్‌ పోటీపై నాయిని సవాల్‌.. వినయ్‌ భాస్కర్‌ ప్రతిసవాల్‌

ఈ వివాదానికి సోమవారం జరిగిన రాజకీయ సవాళ్లే ప్రధాన కారణంగా నిలిచాయి. బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసరగా, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఘాటుగా స్పందించారు. నాయినికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేయాలని, ఉప ఎన్నికలో తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

దీనిపై స్పందించిన నాయిని రాజేందర్‌రెడ్డి సోమవారం సాయంత్రం ఐదు గంటలకు హనుమకొండ చౌరస్తాకు రావాలని వినయ్‌ భాస్కర్‌కు ప్రతిసవాల్‌ విసిరారు. గత పదేళ్లలో వినయ్‌ భాస్కర్‌ చేపట్టిన అభివృద్ధి పనులు, తన హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరి, ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రాజకీయ వేడి పెరిగింది.

క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ బైఠాయింపు

సోమవారం నేతల మధ్య జరిగిన సవాళ్లకు నిరసనగా మంగళవారం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఉన్న బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. నాయిని రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని, విసిరిన సవాళ్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆందోళనకారులు క్యాంపు కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. దీంతో కొంతసేపు క్యాంపు కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రతిఆందోళనకు కాంగ్రెస్‌ శ్రేణుల సన్నద్ధత?

బీఆర్‌ఎస్‌ చేపట్టిన ఆందోళనతో రాజకీయ వివాదం మరో మలుపు తిరిగింది. బీఆర్‌ఎస్‌ నిరసనకు ప్రతిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు కూడా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వరంగల్‌ పశ్చిమలో ఇరు పార్టీల మధ్య రాజకీయ పోరు మరింత బహిరంగంగా మారే అవకాశం ఉంది.

ఇప్పటికే అభివృద్ధి పనులు, రాజకీయ ప్రాతినిధ్యం, నాయకుల పనితీరుపై పరస్పర విమర్శలు చేసుకుంటున్న ఇరు పార్టీల నేతలు ఇప్పుడు నిరసనలు, ప్రతినిరసనల బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చ జరగాల్సిన రాజకీయ వేదికలు నిరసనలకు కేంద్రాలుగా మారుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొత్తంగా నాయిని రాజేందర్‌రెడ్డి, దాస్యం వినయ్‌ భాస్కర్‌ మధ్య మొదలైన సవాళ్ల పర్వం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. రానున్న రోజుల్లో ఇరు పార్టీలు ఎలాంటి కార్యాచరణ చేపడతాయి? బహిరంగ చర్చకు నేతలు ముందుకొస్తారా? లేక నిరసనలు, ప్రతినిరసనలతో రాజకీయ వేడి కొనసాగుతుందా? అన్నది వరంగల్‌ పశ్చిమ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.IMG-20261124-WA0018IMG-20261124-WA0016

Tags:

Post Your Comments

Comments

Latest News

చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన. చర్లపల్లిలో ఉచిత యోగా శిబిరానికి విశేష స్పందన.
చర్లపల్లి,నవంబర్ 24(తెలంగాణ ముచ్చట్లు): స్వామి రాందేవ్ బాబా ఆశీస్సులతో భారత్ స్వాభిమాన్, పతంజలి యోగ సమితి ఆధ్వర్యంలో మంగళవారం హరినాథరావు గురూజీ సారథ్యంలో చర్లపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని...
హనుమకొండ జిల్లాలో విజయవంతమైన పల్స్‌ పోలియో .
నేతాజీ నగర్, శివశక్తి వాసులతో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మర్రిచెట్టు శివాలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.
అక్రమ మొరం తరలింపుపై పోలీసుల కొరడా!
మాదిగ ఉపకులాల వనభోజనాలను విజయవంతం చేయాలి.