అమ్మ ప్రేమకు ఇదేనా విలువ?
కన్నతల్లి కడచూపునకు రాని కొడుకు.. తలకొరివి పెట్టేందుకు ముందుకురాని బిడ్డలు!
బంధాల కంటే స్వార్థమే ముఖ్యమైందా?
కన్నబిడ్డలున్నా.. అనాథగా ముగిసిన తల్లి అంతిమయాత్ర!
బంధుత్వం మరిచిన చోట.. మానవత్వంతో ముందుకొచ్చిన పంచాయతీ సిబ్బంది
జనగామ జిల్లా తరిగొప్పులలో హృదయాలను కలచివేసిన ఘటన
తరిగొప్పుల, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు ప్రత్యేక కథనం):
పది నెలలు కడుపులో మోసింది.. పురిటినొప్పులను భరించి ఈ లోకానికి తీసుకొచ్చింది.. తన ఆకలిని పక్కనపెట్టి బిడ్డల కడుపు నింపింది.. వేల కష్టాలు ఎదురైనా పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్నే ధారపోసింది. కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది. కానీ.. జీవిత చరమాంకంలో ఆ తల్లికి మాత్రం కన్నబిడ్డల నుంచి దక్కింది ఏమిటి? కడచూపునకు రాని కొడుకు.. తలకొరివి పెట్టేందుకు ముందుకు రాని కుమార్తెలు! చివరకు గ్రామస్తులే బిడ్డలై పాడె మోసి సాగనంపిన హృదయవిదారక దృశ్యం!
బిడ్డల కోసం బతికిన తల్లి.. చివరకు ఒంటరిగానే!
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన నాగబండి రామచంద్రం, పుష్పనీల దంపతులకు ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. ఆరుగురు సంతానంతో కుటుంబ జీవితం సాగించిన ఆ దంపతుల్లో ముందుగా రామచంద్రం కన్నుమూశారు. భర్త మరణం తర్వాత పుష్పనీల ఒంటరిగానే జీవనం సాగించారు. చివరకు సోమవారం ఆమె కూడా తుదిశ్వాస విడిచారు.తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని పిల్లలను పెంచిన ఆ తల్లి.. చివరకు తన జీవిత ప్రయాణాన్ని ముగించింది. సాధారణంగా తల్లిదండ్రులు మరణిస్తే కన్నబిడ్డలు చివరిసారిగా చూసేందుకు పరుగున వస్తారు. అంతిమ సంస్కారాలు నిర్వహించి కన్నీటితో వీడ్కోలు పలుకుతారు. కానీ పుష్పనీల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది.
ఫోన్ చేసినా.. రాలేనన్న కొడుకు!
తల్లి మరణించిందన్న సమాచారాన్ని హైదరాబాద్లో ఉంటున్న కుమారుడికి గ్రామస్తులు ఫోన్ ద్వారా చేరవేశారు. అయితే తాను రాలేనని అతడు సమాధానమిచ్చినట్లు సమాచారం. మరోవైపు అంత్యక్రియలకు వచ్చిన ఇద్దరు కుమార్తెలు సైతం తల్లికి తలకొరివి పెట్టేందుకు నిరాకరించినట్లు తెలిసింది.
కన్నతల్లి ఇక తిరిగిరాదని తెలిసినా.. ఆమె చివరి ప్రయాణంలో తోడుగా నిలిచేందుకు కన్నబిడ్డలు ముందుకు రాకపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది. ఆ తల్లి జీవితంలో ఎదురైన కష్టాలకంటే చివరి సమయంలో ఎదురైన ఈ పరిస్థితి మరింత విషాదాన్ని నింపింది.
బంధువులు వెనక్కి తగ్గినా.. గ్రామస్తులు ముందుకొచ్చారు!
కన్నబిడ్డలే బాధ్యత తీసుకోని పరిస్థితుల్లో గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు మానవత్వంతో ముందుకొచ్చారు. నాగబండి కుటుంబానికి చెందిన ఆర్యవైశ్య కులస్తులు, స్థానికులు కలిసి అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. పాడె మోసి ఆ తల్లిని కడసారి సాగనంపారు.
తల్లికి చివరి వీడ్కోలు పలకాల్సిన బిడ్డల స్థానంలో గ్రామస్తులు నిలిచారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ఆత్మీయత దక్కని చోట.. గ్రామ ప్రజలు చూపిన మానవత్వం అందరినీ కదిలించింది. ఎవరికీ సంబంధం లేని ఓ తల్లి అంతిమ సంస్కారాల కోసం ముందుకొచ్చిన వారి ఔదార్యం పలువురి ప్రశంసలు అందుకుంది.
ఆస్తుల కోసం కాదు.. ఆప్యాయత కోసం ఎదురుచూసే అమ్మ!
ఈ ఘటన కేవలం తరిగొప్పుల గ్రామానికే పరిమితమైన విషాదం కాదు. ఆధునిక సమాజంలో కుటుంబ బంధాలు, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతలను మరోసారి ప్రశ్నించే సంఘటన.బిడ్డల కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలకు లెక్కలేదు. వారి భవిష్యత్తు కోసం తమ సంతోషాలను సైతం వదులుకుంటారు. పిల్లలు ప్రయోజకులైతే అదే తమ జీవితానికి గొప్ప సంతృప్తిగా భావిస్తారు. కానీ వృద్ధాప్యంలో వారికి కావాల్సింది పెద్ద పెద్ద ఆస్తులు, అంతస్తులు కాదు.. నాలుగు ఆప్యాయత మాటలు, కాసింత ఆదరణ, అవసరమైనప్పుడు తోడుగా నిలిచే మనుషులు మాత్రమే.బతికున్నప్పుడు తల్లిదండ్రులను ఎంతగా ఆదరిస్తున్నాం? వారి ఒంటరితనాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం? చివరి దశలో వారికి అండగా నిలుస్తున్నామా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాల్సిన అవసరం ఉంది.

పుష్పనీలకు కన్నబిడ్డలు ఉన్నారు.. కుటుంబం ఉంది.. బంధుత్వాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆమె అంతిమయాత్రలో గ్రామస్తులే అండగా నిలిచారు. రక్తసంబంధం లేకపోయినా మానవత్వంతో ముందుకొచ్చిన పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు ఓ తల్లికి గౌరవప్రదమైన చివరి వీడ్కోలు అందించారు.కన్నతల్లి బతికున్నప్పుడు ఆమె విలువ తెలుసుకోవాలి. ఆమె మరణించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నా తిరిగి రాదు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చివరి మజిలీలోనైనా తోడుగా నిలవలేకపోతే.. మనం సాధించిన సంపదకు, సంపాదించిన హోదాకు అర్థమేముంటుంది?తరిగొప్పుల గ్రామస్తులు చూపిన మానవత్వం ఒకవైపు మనసులను తాకుతుంటే.. పుష్పనీల జీవితంలో చోటుచేసుకున్న ఈ విషాదం సమాజాన్ని ఆలోచింపజేస్తోంది.
అమ్మను కోల్పోయిన బాధ ఒకవైపు.. అమ్మకు కడసారి వీడ్కోలు పలికే అవకాశం ఉన్నా రాని బిడ్డల తీరు మరోవైపు.. చివరకు పరాయివారే ఆ తల్లికి ఆత్మీయులై సాగనంపిన వైనం.. ఇదీ తరిగొప్పుల కన్నీటి కథ!


Comments