దీక్షా దివస్ సభకు హుజూరాబాద్ నుంచి భారీగా తరలిరావాలి.
* నవంబర్ 29న కరీంనగర్‌లో జరిగే సభను విజయవంతం చేయాలి
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపు
జమ్మికుంట, నవంబర్ 25 (తెలంగాణ ముచ్చట్లు):
ఈ నెల 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభను విజయవంతం చేసేందుకు హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని స్వాతి గార్డెన్స్‌లో, వీణవంక మండల కేంద్రంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట, వీణవంక మండలాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సమావేశమై సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశాల్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు పాల్గొన్నారు.
మరోవైపు పార్టీ పిలుపు మేరకు జమ్మికుంట పట్టణం, వీణవంక మండలంలో నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి దీక్షా దివస్ సభకు ఆహ్వానించారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను వివరిస్తూ నవంబర్ 29న జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. కేసీఆర్ పోరాట పటిమ, పట్టుదలతో తెలంగాణ ఉద్యమం కీలక మలుపు తిరిగి ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని, అమరుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దీక్షా దివస్ అనేది కేవలం ఒక కార్యక్రమం కాదని, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. కరీంనగర్‌లో జరిగే సభకు హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష దేశ రాజకీయ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశం దృష్టికి తీసుకెళ్లడంలో ఆ దీక్ష కీలక పాత్ర పోషించిందని తెలిపారు. ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. నవంబర్ 29న కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్ సభకు పార్టీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమ అభిమానులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ సభను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ వాలా బాలకిషన్ రావు, మాజీ జడ్పీటీసీ సాదవ రెడ్డి, మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments