కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టే నాలుగు కార్మిక కోడ్‌లు!

కార్మికుల హక్కులకు గొడ్డలిపెట్టే నాలుగు కార్మిక కోడ్‌లు!

44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి కార్మికుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న కేంద్రం

కార్మికుల హక్కుల సాధనకు సంఘాలన్నీ ఐక్యంగా ఉద్యమించాలి: నల్ల స్వామి


హన్మకొండ,నవంబర్25(తెలంగాణ ముచ్చట్లు):

భవన నిర్మాణ రంగ కార్మికులు సహా దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కార్మిక కోడ్‌లు బలహీనపరిచే ప్రమాదం ఉందని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి నల్ల స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కార్మికుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణ కోసం అమల్లో ఉన్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించడం కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే పరిణామమని విమర్శించారు.

వేతనాల కోడ్‌, పారిశ్రామిక సంబంధాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, వృత్తిపరమైన ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ నిబంధనల వెనుక కార్మికుల సంక్షేమం కంటే యాజమాన్యాల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత లభించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. కార్మిక సంఘాల స్వేచ్ఛ, సమిష్టి బేరసారాల హక్కు, నిరసనలు, సమ్మెలు వంటి కార్మిక పోరాటాలపై ఆంక్షలు పెరిగితే కార్మికులు తమ సమస్యలను యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కూడా పరిమితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకే పనికి ఒకే వేతనం అందాలనే న్యాయమైన డిమాండ్‌కు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడటమే కాకుండా, కార్మిక సంఘాల మధ్య ఐక్యతను దెబ్బతీసి తమకు అనుకూలంగా తక్కువ వేతనాలకు పనిచేసే సంఘాలకు పనులు అప్పగించే పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల కార్మికుల మధ్య పోటీ, విభేదాలు పెరిగి యాజమాన్యాల ఆధిపత్యం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్మికుల సేవలను అవసరానికి అనుగుణంగా వినియోగించుకుని, వారి ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేసే విధానాలు కార్మిక వర్గానికి ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు.

భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ప్రత్యేక పోరాటం అవసరం

నాలుగు కార్మిక కోడ్‌లపై జరుగుతున్న చర్చలతో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా కార్మిక సంఘాలు విస్మరించకూడదని నల్ల స్వామి సూచించారు. ఈ కోడ్‌ల పరిధిలోకి వచ్చే పారిశ్రామిక కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు, గిగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, హమాలీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితర వర్గాల హక్కుల పరిరక్షణకు సంఘాలు అండగా నిలవాలని కోరారు.

అదే సమయంలో భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో నకిలీ కార్మికుల నమోదును అరికట్టాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేసే కార్మికుల నమోదుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న ఉపాధి, భద్రత, సంక్షేమ సమస్యలపై ప్రత్యేక ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి

భవన నిర్మాణ కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, వివిధ రకాల ఆర్థిక సహాయాలు, ఇతర ప్రయోజనాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా అర్హులైన ప్రతి కార్మికుడికి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నల్ల స్వామి డిమాండ్ చేశారు. కార్మికుల చెమట చుక్కలతో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థలో వారి కుటుంబాల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.

కార్మికుల హక్కులను కాపాడుకోవడం, సంక్షేమ బోర్డు ద్వారా అందాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడం ఒక్క సంఘం వల్ల సాధ్యం కాదని, అన్ని కార్మిక సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ విభేదాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూ, అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి హక్కులను సాధించుకోవాలని నల్ల స్వామి పిలుపునిచ్చారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు* శుభకార్యాలకు హాజరు..* *నూతన జంటలకు ఆశీర్వచనాలు*
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు ) రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో...
ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షల నేపథ్యంలో పరీక్ష కేంద్రాల సిబ్బందికి బయోమెట్రిక్ శిక్షణ.
మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్.
ప్రారంభమైన అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల వెరిఫికేషన్ ప్రక్రియ.
దళిత హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.. డ్రైవర్‌పై కేసు నమోదు.