వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ
-పాల్గొన్న వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య
హన్మకొండ, తెలంగాణ ముచ్చట్లు.
వక్ఫ్ బోర్డు చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సవరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుసృ పాషా ఆధ్వర్యంలో హన్మకొండలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ నుండి జక్రియా ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు “హిందూస్తాన్ జిందాబాద్”, “సెక్యులరిజం జిందాబాద్” అనే నినాదాలతో గట్టిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మత సోదరత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని ఈ సందర్భంగా పలువురు నేతలు హితవు పలికారు.
ఈ సందర్భంలో మాట్లాడిన డా.కడియం కావ్య మాట్లాడుతూ, “వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ముస్లిం మైనారిటీల హక్కులను హరించే దిశగా ఉంది. ఇది లౌకిక రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మతోన్మాద చర్యలలో ఒకటిగా భావించవచ్చు. మైనారిటీల ఆస్తుల్ని కేంద్రం నియంత్రించాలనే ఉద్దేశంతో వక్ఫ్ చట్టాన్ని మారుస్తోంది. ఇది ముస్లింలపై కక్ష సాధింపు చర్యకు నిదర్శనం,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ స్థాపన దశ నుండే లౌకికత్వానికి కట్టుబడి ఉన్నదని, ఇటువంటి చట్టాలను తాము బలంగా వ్యతిరేకిస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యవాదులు, మతపరమైన సామరస్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రయత్నాలను ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మతపెద్దలు, ముస్లిం సంఘాల ప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా కొనసాగింది.
Comments