ముక్కోటి ఏకాదశి నాటికి* *" భద్రాద్రి"ని సిద్ధం చేస్తాం
* భవిష్యత్ తరాలకు ఆదర్శంగా దేవస్థాన అభివృద్ధి పనులు
* మరో 200 ఏళ్ళు నిలిచేలా రూ.300 కోట్లతో శాశ్వత నిర్మాణాలు
* కేబినెట్ సబ్ కమిటీ ద్వారా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
* భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అభివృద్ధి పనుల పరిశీలన
ఖమ్మం బ్యూరో, నవంబర్ 25(తెలంగాణ ముచ్చట్లు )
గోదావరి పుష్కర మహోత్సవాల్లో భాగంగా.. బాసర నుంచి భద్రాద్రి వరకు టెంపుల్ కారిడార్ లో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను డిసెంబర్ 19న నిర్వహించే ముక్కోటి ఏకాదశి నాటికి.. భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రధాన నిర్మాణాలను పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను మంత్రి పొంగులేటి పరిశీలించారు. దమ్మక్క అన్నదాన సత్రం నుంచి మెట్ల దారి వరకు.. ప్రధాన ఆలయం చుట్టూ చేపట్టిన కాంక్రీట్ నిర్మాణ పనులను నిశితంగా పరిశీలించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షించారు.అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..రూ. 1,100 కోట్లతో గోదావరి పుష్కరాలకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం వద్ద రూ. 300 కోట్లతో దేవస్థానం చుట్టూ అభివృద్ధి పనులు చేస్తున్నామని, ప్రస్తుతం స్లాబ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. పుష్కరాలప్పుడు ప్రధాన పుణ్యక్షేత్రంగా భద్రాచలం నిలుస్తుందని.. కోటి మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
*భావితరాలు మెచ్చేలా పనులు*
భద్రాచలం వద్ద చేస్తున్న అభివృద్ధి పనులు 200 ఏళ్ళ పాటు.. భావితరాలు మెచ్చేలా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో.. కేబినెట్ సబ్ కమిటీ ద్వారా 15 రోజులకోసారి పనులను సమీక్షిస్తున్నట్లు, తాను ఇప్పటికే నాలుగైదు సార్లు వ్యక్తిగతంగా పరిశీలించినట్లు వివరించారు.
*ఈ కార్యక్రమంలో..:* కలెక్టర్ దివాకర.టీఎస్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఐటిడిఏ పిఓ రాహుల్, సబ్ కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.


Comments