ఎన్నికల ఏర్పాట్లకు స్కూల్ బస్సుల సహకారం.!
- సత్తుపల్లి రవాణా శాఖ అధికారుల సమావేశం.
- మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె.ఎన్. శ్రీనివాసరావు.
సత్తుపల్లి, డిసెంబర్ 3 (తెలంగాణ ముచ్చట్లు):
రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్కూల్ బస్సులను అందుబాటులో ఉంచాలని రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలను కోరారు. ఈనెల 17న జరిగే మూడవ విడత ఎన్నికల కోసం అవసరమైన రవాణా ఏర్పాట్లపై బుధవారం సత్తుపల్లి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సమావేశం జరిగింది. సత్తుపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (వాహనాల నోడల్ అధికారి) జె.ఎన్. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎం.వి.ఐ రాజశేఖర్, ఏ.ఎం.వి.ఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సత్తుపల్లి, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు, సింగరేణి మండలాలకు చెందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు హాజరయ్యారు. ఈ మండలాల్లో కలిపి సుమారు 160 స్కూల్ బస్సులు ఉన్నట్లు అధికారులు వివరాలు సేకరించారు. పోలింగ్ సిబ్బంది, సామాగ్రి తరలింపునకు 16, 17 తేదీల్లో ఈ బస్సులను సిద్ధంగా ఉంచాలని శ్రీనివాసరావు కోరారు.
తమదైన బాధ్యతగా భావిస్తూ ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల సంఘ నిర్వాహకులు నాయుడు వెంకటేశ్వరరావు, పసుపులేటినాగేశ్వరరావు, ఇస్మాయిల్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


Comments