ఆటో డ్రైవర్ ఆత్మాహుతి యత్నం చికిత్స పొందుతూ మృతి
మల్కాజ్గిరి, నవంబర్ 5 (తెలంగాణ ముచ్చట్లు):
కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడి మరణించిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కుకోవడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి:భగత్ నగర్, జమ్మిగడ్డ జవహర్ నగర్‌కు చెందిన సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అద్దె ఆటో (నంబర్ ఏపి 28 వై 1789) నడుపుతూ జీవనోపాధి సాగించేవాడు. తేదీ: 04.11.2025 మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో రాధికా ఎక్స్ రోడ్ వద్ద కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ డ్రైవ్ చెకింగ్‌లో మద్యం సేవించి అక్రమంగా వాహనం నడిపినట్టుగా గుర్తించారు. దీంతో అతను నడుపుతున్న ఆటోను సీజ్ చేసి, "నీ తరపున మద్యం సేవించని వ్యక్తి వస్తే ఆటో అప్పగిస్తాం" అని పోలీసులు తెలిపారు.ఈ సంఘటన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన మీన్ రెడ్డి రాత్రి సుమారు 10.20 గంటల సమయంలో ట్రాఫిక్ స్టేషన్ దగ్గరే పెట్రోల్ పోసుకొని నిప్పు పెట్టుకున్నాడు. దీనిని గమనించిన పక్కవారు, పోలీసులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను తేదీ: 05.11.2025 ఉదయం 5.10 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించాడు.మద్యపాన అలవాటు, ఆర్థిక ఇబ్బందులు కారణం మీన్ రెడ్డి దీర్ఘకాలంగా మద్యానికి బానిసై ఉందని, అద్దెకు తీసుకున్న ఆటోను పోలీసులు సీజ్ చేయడంతో యజమాని అడుగుతాడేమోనన్న భయంతో మనోవేదనకు గురై ఆత్మాహుతికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Comments